‘నీట్‌’కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

రెండు కేంద్రాల్లో 388 మంది అభ్యర్థులు

భద్రత, పర్యవేక్షణపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలో నేడు(ఆదివారం) నిర్వహించనున్న నీట్‌ పరీక్షకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కంట్రోల్‌ రూం, పరీక్షహాళ్లు, భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ వ్యవస్థలు, బయోమెట్రిక్‌ పరికరాల పనితీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 388 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220 మంది, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 168 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్‌ ధృవీకరణ, సీసీటీవీ నిఘా, సిగ్నల్‌ జామర్లు, జనరేటర్‌ బ్యాకప్‌ వంటి సదుపాయాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భద్రతా పరంగా ప్రతీ కేంద్రం వద్ద తహసీల్దార్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు నలుగురు పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థినుల తనిఖీల కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో మహిళా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతీ కేంద్రం వద్ద మెడికల్‌ క్యాంప్‌, అంబులెన్స్‌, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నీట్‌ పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా యంత్రాంగం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, అడిషనల్‌ ఎస్పీ నరేష్‌కుమార్‌, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రమణరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement