భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ దేవేందర్, డెమో శ్రీదేవి ఈ తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని కిరణ్, యోదా, మేధ, స్మార్ట్ కేర్, శ్రీ వెంకటేశ్వర, ప్రధాన్ ఆస్పత్రులలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ, కాలుష్య నియంత్రణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అవసరమైన అనుమతులు, సర్టిఫికెట్లు, ధరల పట్టికలు తదితర అంశాలను పరిశీలించారు. అన్ని ఆస్పత్రుల్లోనూ దశలవారీగా తనిఖీలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రేపు అంతర్జాతీయ
యోగా దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయుష్ వైద్యులు, నోడల్ అధికారి డాక్టర్ రాఘవేంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అవినీతి అనడం
హాస్యాస్పదం
కాళేశ్వరం: కాళేశ్వరాలయం టెండర్లు పూర్తికాలేదని అప్పుడే అవినీతి అని పుట్ట మధు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అని కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్‌శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వర క్షేత్రాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు.
‘యాత్రను అడ్డుకోవడం సరికాదు’
భూపాలపల్లి అర్బన్: బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన ఓపెన్ కాస్టు సందర్శనకు వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతమని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని అవినీతి ప్రభుత్వం నుంచి కాపాడాలని కోరారు. సింగరేణి కార్మికుల భద్రతను రక్షించేందుకు కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లక్కీ డ్రా
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ఎంపికకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి హాజరయ్యారు. జిల్లాలోని నాలుగు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతికి 41 సీట్లు, 5వ తరగతికి 43 సీట్లు కలిపి మొత్తం 84 సీట్ల భర్తీ కోసం లక్కీ డ్రా చేపట్టారు. ఈ ప్రవేశాల కోసం 141 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అర్హత పొందిన 135 మంది విద్యార్థుల పేర్లతో డ్రా నిర్వహించారు. ఇందులో 84 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఈ సందర్భంగా అధికారులు పారదర్శకంగా లక్కీ డ్రా ప్రక్రియను నిర్వహించి, ఎంపికైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సుకీర్తి జై భీం, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, రెసిడెన్షియల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిక్షపతి, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


