కేజీబీవీ పాఠశాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ పాఠశాల తనిఖీ

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

మల్హర్‌(కాటారం): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని శానిటేషన్‌, టాయిలెట్లు, స్టోర్‌రూం, తాగునీరు, గదుల్లోని వెంటిలేషన్‌, కార్యాలయ రికార్డులను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అడ్మిషన్ల సంఖ్య పెంచాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న 80 సీట్లకు దరఖాస్తు చేసుకునేలా చూడాలని ప్రిన్స్‌పాల్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ మార్క శ్రీధర్‌బాబు, పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నైరుతి ప్రాకారం నుంచి తొలగింపు ప్రక్రియ షురూ

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం నైరుతిలో ఉన్న విజయగణపతి ఆలయం నుంచి దక్షిణ గోపురం వరకు ఉన్న ప్రాకారం విగ్రహాలను తమిళ శిల్పి రవీంద్రన్‌ ఆధ్వర్యంలో తొలగింపు ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ముందుగా కొబ్బరికాయ, గుమ్మడికాయలు కొట్టి తొలగింపును ప్రారంభించగా.. ప్రాకారంపై ఉన్న విగ్రహాలను తొలిగించారు. బుధవారం శృంగేరి పీఠం శిష్యులు విశేష పూజలు చేసి ఆదిముక్తీశ్వరాలయంలో బాలాలయం ఏర్పాటు చేసి ఉత్సవ మూర్తులకు ప్రాణపత్రిష్ఠ చేసిన విషయం తెలిసిందే. దీంతో తొలగింపును దేవాదాయశాఖ గురువారం నుంచి ప్రారంభించింది. పూర్తి స్థాయిలో త్వరలో ప్రారంభిస్తారని తెలిసింది.

వైన్‌షాపులో అగ్ని ప్రమాదం

చిట్యాల: మండలంలోని చల్లగరిగ గ్రామంలో ఓ వైన్‌ షాపులో బుధవారం అర్ధరాత్రి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో సుమారు లక్ష రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్లు షాపు నిర్వాహకులు తెలిపారు. రెండు షెటర్లలో మద్యం విక్రయాలు నిర్వహిస్తుండగా బుధవారం రాత్రి షాపులను మూసి ఇంటికి వెళ్లారు. అనంతరం షెటర్‌ లోపల విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పొగలు, మంటలు వస్తున్నాయని ఇంటి యజమాని తెలుపడంతో హూటహూటిన నిర్వాహకులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహకారంతో మంటలను అదుపుచేశారు. దీంతో అప్పటికే రూమ్‌లో ఉన్న మద్యం సీసాలు పగిలిపోయాయి. సమయానికి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిదని గ్రామస్తులు పేర్కొన్నారు.

అక్రమ అరెస్టులతో

ఉద్యమాన్ని ఆపలేరు

వెంకటాపురం(కె): అక్రమ అరెస్టులతో ఆది వాసీల భూ ఉద్యమాన్ని ఆపలేరని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్సా నర్సింహమూర్తి అన్నారు. ఏటూరునాగారంలోని భూ పోరాటం చేస్తున్న ఆదివాసీ మహిళలకు అండగా వెళ్తున్న ఆది వాసీ నాయకులను పోలీసులు గురువారం హౌస్‌ అరెస్టు చేయటం సరికాదన్నారు. పలువురు ఇరువర్గాల మధ్య ఘర్షణ పేరుతో ప్రజలను తప్పదోవ పట్టించేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాలకులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు గిరిజనుల గిరిజనేతరుల మధ్య గొడవ సృష్టిస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement