భూపాలపల్లి: పర్యావరణ పరిరక్షణలో అటవీ శాఖ పాత్ర ఎంతో కీలకమైనదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గుర్రంగూడలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వనమహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన సీసీఎఫ్ భవనాన్ని ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. జిల్లాకేంద్రంలోని నూతన కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, సీసీఎఫ్ ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ జిల్లాలో సీసీఎఫ్ నూతన భవనం ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ వన మహోత్సవ స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. నూతన సీసీఎఫ్ భవన నిర్మాణం జిల్లా అటవీ సంపద రక్షణకు, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే, కలెక్టర్, ఇతర అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రభాకర్, డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


