● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
కాళేశ్వరం: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర క్షేత్రాన్ని ఏటీఎంగా మార్చుకున్న ఎమ్మెల్యే ఆలయ పునర్నిర్మాణం పేరుతో వంద కోట్లు దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. గురువారం కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక అధికారిని పంపించి తూతూమంత్రంగా మీటింగ్ పెట్టి సుమారుగా రూ.198 కోట్ల టెండర్ పిలిచారని, అంటే దాదాపు వంద కోట్ల మింగడానికే పునర్నిర్మాణం కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని సీఎం చెబుతున్నారని.. రూ. 198కోట్ల ఎలా తీసుకువస్తాడో ఎమ్మెల్యే ప్రజలకు చెప్పాలన్నారు. ఆలయాన్ని కూలగొట్టే ముందు విధి విధానాలను చెప్పాలన్నారు. అంతకంటే ముందు భూపాలపల్లి కలెక్టర్ ఖాతాలో వంద కోట్లు జమ చేస్తేనే నమ్ముతామన్నారు. లేదంటే కూల్చివేతలను అడ్డుకుంటామని తెలిపారు. ఈ మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డ ఆలయాలపై ఆధారపడి జీవించే బ్రాహ్మణ పురోహితులు అడ్డుకోవడానికి ముందుకు వస్తారని స్పష్టం చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌పార్టీ నాయకులు ఉన్నారు.


