సాగుకు సమాయత్తం | - | Sakshi
Sakshi News home page

సాగుకు సమాయత్తం

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

భూపాలపల్లి రూరల్‌: జిల్లా రైతులు వానాకాలం సాగు పనుల్లో బిజీబిజీగా మారిపోయారు. జిల్లాలో ప్రధాన పంట అయిన పత్తి సాగువైపు రైతులు ముందస్తుగానే అడుగులు వేస్తున్నారు. పత్తి సాగుచేసే రైతులు ఇప్పటికే పొలాల్లోని పాత పత్తి కట్టెలను పీకి, కాల్చివేసి భూమిని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే వర్షాలు పడిన ప్రాంతాల్లోని నల్లరేగడి భూముల్లో పత్తి విత్తనాలు కూడా వేస్తున్నారు.

1,06,560 ఎకరాల్లో పత్తి సాగు అంచనా..

ఈ వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 1,06,560ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ విస్తీర్ణానికి గాను దాదాపు 2.80 లక్షల పత్తివిత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని అధికారులు లెక్కగట్టారు. రైతులకు కొరత లేకుండా జిల్లాలోని విత్తన దుకాణాల వ్యాపారులు ముందస్తుగానే హైబ్రీడ్‌ పత్తి విత్తనాల ను సిద్ధం చేసి ఉంచారు. ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లో చిరుజల్లులు కురవడంతో తడిని ఉపయోగించుకుని కల్టివేటర్లతో భూమిని మెత్తగా దు న్నుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్‌, గుర్రంపేట, టేకుమట్ల, చిట్యాల, రేగొండ మండలాల్లోని మెజారిటీ గ్రామా ల రైతులు వేసవి దుక్కులను దున్నుకుని విత్తనాలు వేసేందుకు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

పత్తి తర్వాతే వరి వైపు చూపు

రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మట్టి పదునయ్యే వర్షాలు పడగానే పత్తి విత్తనాలు విత్తేందుకు రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జూన్‌ చివరి నాటికి పత్తి విత్తుకునే పనులను పూర్తిగా ముగించుకోవాలని రైతులు భావిస్తున్నారు. ఆ తర్వాతే వరి సాగువైపు దృష్టి సారించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు వరి నారుమళ్ల కోసం భూములను సిద్ధం చేసుకోగా, కొన్నిచోట్ల వరినార్లు కూడా పోసి వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అనుకూలమైన వర్షాలు పడితే ఈ ఏడాది వానాకాలం సీజన్‌ జిల్లాలో లాభసాటిగా సాగుతుందని రైతాంగం ధీమా వ్యక్తం చేస్తోంది.

గ్రామాల్లో సాగుపనులు

మహాముత్తారం: నాలుగు రోజుల క్రితం మహాముత్తారం మండలంలో ఓ మోస్తారు వర్షం పడింది. దీంతో మండలంలోని కనుకునూర్‌, బోర్లగూడెం, యామన్‌పల్లి, నల్లగుంటమీనాజీపేట, మహాముత్తారం తదితర గ్రామాల్లోని రైతులు సాగుపనుల్లో మునిగిపోయారు. బుధవారం వివిధ గ్రామాల్లో రైతులు చేలల్లో అచ్చుకొట్టడంతో పాటు పత్తి విత్తనాలు నాటుతున్నారు.

దుక్కులు దున్నుకునే పనిలో

రైతులు నిమగ్నం

వర్షాలు కురిస్తే విత్తుకునేందుకు

సన్నద్ధం

ఎరువులు, విత్తనాలు కొనుగోలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement