గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జాలపల్లి నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయమే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.
ఎమ్మెల్యేను కలిసిన
ఎస్‌ఈ రమేశ్
భూపాలపల్లి రూరల్: పదోన్నతిపై జిల్లాకు వచ్చిన భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేశ్ సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. నిజా మాబాద్ డివిజనల్ ఇంజనీర్, (టెక్నికల్)గా ఉన్న రమేశ్ పదోన్నతిపై ఎస్‌ఈగా భూపాలపల్లికి వచ్చారు. ఎస్‌ఈ వెంట భూపాలపల్లి డివిజ నల్ ఇంజనీర్ పాపిరెడ్డి ఉన్నారు.
బస్సులు ఫిట్‌నెస్
చేయించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులను ఫిట్‌నెస్ చేయించుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి వెంకన్న ఆదేశించారు. ఈ మేరకు పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఫిట్‌నెస్ చేయని బస్సులకు జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు. బస్సుల్లో నిబంధనలు పాటించాలని, వేగంగా వెళ్లకుండా నియంత్రణతో నడపాలని డ్రైవర్లకు సూచించారు. లైసెన్స్ కలిగిన డ్రైవర్లు మాత్రమే బస్సులను నడపాలని ఆదేశించారు.
భద్రకాళి దేవాలయంలో ప్రతిష్ఠాపనోత్సవ పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో మూడు రోజులపాటు జరగనున్న ధ్వజస్తంభ ప్రతిష్ఠామహోత్సవ పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి ఆజ్ఞ తీసుకుని అనంతరం పూర్వంగవిధి, యాగశాల ప్రవేశం చేశారు. సర్వతోభద్రమండల రచన, దేవతాహ్వానం, మూలమంత్రనుష్టాన హోమాలు, కుటీర హోమం, జలాధివాసం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎస్‌ఈ ఇరిగేషన్ హరివెంకటరామ ప్రసాద్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
కేయూ ఫిజిక్స్ విభాగం బీఓఎస్‌గా నరేందర్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగం బోర్డు ఆఫ్‌స్డడీస్ చైర్మన్‌గా ఆ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్‌గా బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్ వరలక్ష్మి పదవీకాలం పూర్తికావడంతో ఆమెస్థానంలో నరేందర్‌ను నియమించారు. ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు నరేందర్‌కు వీసీ కె.ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు అందించారు.


