● శ్రీ ఆదిముక్తీశ్వరాలయం వద్ద
ఏర్పాట్లు ముమ్మరం
● రేపు పునరుద్ధరణ, తొలగింపు
ప్రక్రియ షురూ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేఽశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈనెల (రేపు) 17న బుధవారం ఉదయం 8.15 గంటలకు కళాప్రకర్షణ క్రతువుతో శృంగేరి పీఠాధిపతి శిష్య బృందంచే విశేష పూజలతో ఆరంభం కానుంది. రూ.198కోట్ల వ్యయంతో ఆలయ పునరుద్ధరణ, ఆలయాల తొలిగింపు కార్యక్రమం జరుగుతుండడంతో ప్రస్తుత దేవస్థానానికి కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీఆదిముక్తీశ్వరాలయం వద్ద అభిషేక పూజలు నిర్వహించడానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పక్కనే ఉన్న షెడ్డులో బాలాలయాలు ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. అందులోనే ఉత్సవ మూర్తులు శ్రీశుభానందముక్తీఽశ్వరులు, సరస్వతీ అమ్మవార్లను ఆసీనులు చేసి భక్తుల దర్శనాలు చేయడానికి వీలు కల్పించనున్నారు. దుకాణాలు నిర్వహించడానికి ప్లాట్‌ఫారం సిద్ధం చేశారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. రెండు కంటెయినర్లలో కార్యాలయం, టికెట్ విక్రయాలు, ప్రసాద విక్రయాలు జరపనున్నారని తెలిసింది. ఇంకా కాలసర్ప, శని పూజలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిసింది. మంగళవారం దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు స్థానికుల అభిప్రాయాలు తీసుకోనున్నారని సమాచారం. 17న జరుగనున్న పూజా క్రతువు విషయంలో దేవాదాయశాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలుబడలేదు. భక్తులు, స్థానికులు ఆ శాఖ ప్రకటన కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.


