మహాముత్తారం: మండలంలోని రెడ్డిపల్లి కనుకునూర్‌లో ఆదివారం ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో రెడ్డిపల్లి కనుకునూర్ మధ్య కరెంటు వైర్లపై పెద్ద వృక్షం పడింది. రెండు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెడ్డిపల్లి గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది చెట్టును తొలిగించారు.
కంకరవేశారు..
బీటీ మరిచారు
మహాముత్తారం: మండలంలోని పర్లపల్లి నుంచి లింగాపూర్ వెళ్లే రోడ్డు సుమారు కిలో మీటరు వరకు ఎనిమిది సంవత్సరాల క్రితం అధికారులు కంకరపోసి వదిలేశారు. అప్పటినుంచి పర్లపల్లి గ్రామస్తులు రోడ్డుగుండా ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకర తేలి భారీగుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీశాఖ అధికారులు ఇప్పటికై నా స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని లాడ్జిల్లో సీసీఎస్ పోలీసులు ఆదివారం తెల్లవారు జామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అతిథుల రిజిస్టర్లు, సీసీ కెమెరాల పనితీరు, బస చేస్తున్న వ్యక్తుల వివరాలను సీసీఎస్ సీఐ రమేష్ పరిశీలించారు. లాడ్జిలకు వచ్చే ప్రతి అతిథి ఆధార్ వివరాలు, రాకపోకల సమయాలు, ఇతర వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా భద్రత, నేరాల నియంత్రణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
అవగాహన కల్పించినా కాల్చేస్తున్నారు
మహాముత్తారం: రైతులు పంటలు పండించిన అనంతరం వాటిని పొలంలో కలియ దున్నాలి కానీ కాల్చవద్దని వ్యవసాయ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించారు. కానీ మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు వరికొయ్యలను కాల్చుతూ సారవంతమైన భూమిలోని క్రిమి కీటకాలను చంపేస్తున్నారు. దీంతో వ్యవసాయ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి వరికొయ్యలను కాల్వడం వలన భూమిలోని క్రిమి కీటకాలు చనిపోవడమే కాకుండా భూమిపొర వేడికి సారవంతాన్ని కోల్పోయి పంటదిగుబడి తగ్గుతుందని ఎవరైనా రైతులు కొయ్యకాళ్లను కాలబెడితే నష్టాన్ని బట్టి 5వేల నుంచి 25వేల వరకు జరిమానా విధించనున్నట్లు రైతులకు అవగాహన కల్పించారు. అయినప్పటికీ గ్రామాల్లోని రైతులు మాత్రం కొయ్యకాళ్లను తగలబెడుతున్నారు.
ఎంజీఎంలో డిప్యుటేషన్‌పై నర్సింగ్ సిబ్బంది
కాశిబుగ్గ: ఎంజీఎం ఆస్పత్రిలో 478 మంది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 161 మంది ఇన్‌పేషంట్లకు సేవలందించడం సమస్యగా మారింది. రెండు వార్డులకు కలిపి ఒక నర్సింగ్ ఆఫీసర్‌తో సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈక్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని నర్సింగ్ ఆఫీసర్లను డిప్యుటేషన్‌పై ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. అలాగే, నర్సింగ్ స్కూల్‌కు చెందిన వందలాది మంది విద్యార్థినులను కూడా నర్సింగ్ ఆఫీసర్లకు అసిస్టెంట్లుగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల సమస్య తీరాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కొత్తవారు జాయిన్ అయితేనే నర్సింగ్ సేవలు సజావుగా అందుతాయి. ఇప్పటికే ఎంజీఎంలో సూపరింటెండెంట్ పోస్టు భర్తీ కాకపోవడం, నర్సింగ్ సిబ్బంది జాయిన్ కాకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది.


