ములుగు రూరల్: రాంచంద్రాపురం భూములకు పట్టాల పంపిణీ ద్వారా భావితరాలకు శాశ్వత భూ హక్కులు కల్పిస్తున్నామని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వేగంగా పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం మల్లంపల్లి మండలం రాంచంద్రాపురం రైతు వేదికలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో మల్లంపల్లి, రాంచంద్రాపురం, గుర్తూర్‌తండా, భూపాల్‌నగర్, శివతండా, కొడిశలకుంట, ముద్దునూరుతండా ప్రజల నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాంచంద్రాపురం గ్రామ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్‌లు మహేందర్‌జీ, సంపత్‌రావు పాల్గొన్నారు.


