భూపాలపల్లి అర్బన్: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో పెద్దఎత్తున కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్రకళ సూచించారు. శుక్రవారం పోలీసు అధికారులు, న్యాయవాదులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి లోక్ అదాలత్ విజయవంతానికి అవసరమైన చర్యలపై చర్చించారు. కేసుల పరిష్కారంలో రాజీమార్గాన్ని ప్రోత్సహించాలన్నారు. ఇరుపక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకుంటే సమయం, ధనం ఆదా కావడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో రాజీద్వారా పరిష్కారం పొందిన వారికి చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి అందజేస్తారని తెలిపారు. ఈ సమావేశాల్లో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, అదనపు ఎస్పీ ఎ.నరేష్‌కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందరపు శివకుమార్, డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ పాల్గొన్నారు.
బంగారు భవితను కాపాడాలి
పరిశ్రమలలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారి బంగారు భవితను కాపాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్రకళ పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం కోర్టుహాల్‌లో పోలీసు అధికారులతో చర్చించారు. జిల్లాలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న బాలలను గుర్తించి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పారా లీగల్ వాలంటీర్లు, కార్మిక శాఖ, రెవెన్యూశాఖ అధికారుల సమన్వయంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, ిసీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.


