ములుగు రూరల్: యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయంలో గంజాయి కేసుల్లో శిక్షపడిన వారితో వృక్ష రూపణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వ్యక్తి జీవితంలో మార్పు సాధ్యమేనని తెలిపారు. గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ముందుకు సాగాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ బాగుంటుందని వెల్లడించారు. గంజాయి అమ్మకాలపై సమాచారం అందించిన వారికి రూ. 5,116 నగదు బహుమతి అందిస్తామని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, సీఐ సురేశ్ కుమార్, ఆర్‌ఐ అడ్మిన్ స్వామి, ఎస్సైలు ఉపేందర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
‘ప్రైవేట్’ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేయడం, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం, అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్ ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడం ఆందోళనకరమన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అధిక ఫీజులు వ సూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలమైతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కన్నెపల్లి ఇసుక క్వారీలో అక్రమంగా టీజీఎండీసీ సిబ్బంది లారీలో ఇసుక లోడింగ్ చేయడానికి రూ.3వేలు డిమాండ్ చేశారని లారీ యజమాని లింగంపల్లి రామారావు టీజీఎండీసీ ఎండీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లారీలోడు కోసం ఆన్‌లైన్‌లో అన్ని రుసుములు చెల్లించామని, ఇసుక రీచ్ వద్ద లోడింగ్ చార్జీల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎండీని కోరినట్లు చెప్పారు.
నేడు కిసాన్ మేళా..
సాంకేతిక సదస్సు
ములుగు రూరల్: ఖరీఫ్ సీజన్‌ను పురస్కరించుకొని జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న కిసాన్ మేళా, సాంకేతిక సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో హజరై విజ యవంతం చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేశ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోవిందరావుపేట మండలం పీఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించనున్న కిసాన్ మేళా నేడు(గురువారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సాగు మేలకువలను రైతులకు అందించనున్నట్లు వివరించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
ములుగు: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ములుగులోని రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధంపై అవగాహన కల్పించినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారి అరుణాదేవి తెలిపారు. రోజువారీ జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను స్వీకరించడం, ఎస్‌డబ్ల్యూఎం నిబంధనలు, సుస్థిర అభివృద్ధికి సీఎస్‌ఆర్ అమలు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కోసం సాంకేతికతలను స్వీకరించడం గురించి అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. సౌరశక్తి, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, గ్రీన్ మోడలింగ్ టెక్నాలజీస్ వంటి సహజ వనరుల పరిరక్షణపై ఇంటరాక్టివ్ సెషన్ సైతం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం జిల్లా రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌తో కలిసి వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.


