● టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి
భూపాలపల్లి అర్బన్: టీబీజీకేఎస్ గేట్ మీటింగ్‌లకు హాజరవుతున్న కార్మికులను, గులాబీ కండువాలు ధరించిన వారిని గుర్తింపు సంఘాల నాయకులు బెదిరించడం సిగ్గుచేటని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి విమర్శించారు. ఏరియాలోని కేటీకే–5 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కేటీకే–5 గనిలో వాటర్ ప్లాంట్‌ను వెంటనే మరమ్మతులు చేసి కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, మ్యాన్‌రైడింగ్ సమస్యను పరిష్కరించి కార్మికుల కోసం షెడ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రశ్నించే వారిని బెదిరించడం తగదన్నారు. టీబీజీకేఎస్ కార్మికులకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెడికల్ బోర్డుల ద్వారా వేలాది వారసత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ బోర్డులను నిర్వహించకపోవడంతో కార్మిక కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. సింగరేణి బొగ్గు నిల్వలు, ఉత్పత్తి, సరఫరా గణాంకాల విషయంలో యాజమాన్యం పొంతనలేని లెక్కలు చూపిస్తోందని ఆరోపించారు. బొగ్గు నిల్వలు, లాభాలు, అప్పుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణికి ప్రభుత్వం బకాయి ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, నాయకులు, మధు, అవినాష్‌రెడ్డి, మహేందర్, కార్మికులు పాల్గొన్నారు.


