● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించి ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరస్తులకు శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేయాలన్నారు. సీసీటీఎన్‌ఎస్ 2.0లో ప్రతీ కేసును సకాలంలో నమోదు చేసి వివరాలను అప్‌డేట్ చేయాలని, వ్యవస్థలోని అన్ని ఫీచర్లను వినియోగించి పారదర్శకత పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై గ్రామస్థాయి వరకు అవగాహన కల్పించాలని, గంజాయి రవాణా, మట్కా, జూదంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలను విస్తరించి పర్యవేక్షించాలని, బ్లాక్ స్పాట్స్ గుర్తించి రోడ్డు ప్రమాదాలు నివారించాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ అధికారులు ప్రజలతో మమేకమై ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


