న్యూస్‌రీల్
అధికారుల వత్తాసుతోనే..
భూపాలపల్లి
పట్టణంలో పేరుకే జీఎస్టీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం జీఎస్టీ బిల్లులు లేకుండానే ఎక్కువ శాతం సరుకులు ’జీరో బిల్లు’తో సాగుతోంది. జీరో బిల్లు దందాతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఈ దందాకు అధికారులు వత్తాసు, అండదండలు ఉండటంతో అడ్డులేకుండా సాగుతోంది.
భూపాలపల్లి జిల్లాకేంద్రాన్ని ఆనుకొని చుట్టుపక్కల మండలాల్లో కొన్ని ప్రాంతాలు గిరిజన పల్లెలు కావడంతో జీరో దందాకు కేంద్ర బిందువుగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి స్థానిక వ్యాపారులకు వివిధ రూపాల్లో బిల్లులు లేకుండానే సరుకులు వస్తుండగా, కోట్లాది రూపాయల సరుకులు వినియోగదారులకు, చిన్న చిన్న వ్యాపారులకు యథావిధిగా జీఎస్టీ బిల్లు ఇవ్వకుండా విక్రయాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయల సరుకులు వేరే రాష్ట్రాలతోపాటు వరంగల్, హైదరాబాద్ తోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి రావడం, వాటిని వ్యాపారులు తమ గోదాంలకు తరలించి అక్రమంగా నిల్వ ఉంచడం కొన్నేళ్లుగా షరామామూలేగా జరుగుతోంది. పట్టపగలు, రాత్రి తేడా లేకుండా ఆయా సరుకులను జీరో బిల్లుతోనే ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఐరన్, ఆటోమొబైల్ వస్తువులు, వంట నూనెలు, ఎరువులు, పురుగుల మందులు, పంచదార, బెల్లం, సిమెంట్, ఎలక్ట్రికల్ సామన్లు, బంగారు అభరణాలతో సహా అన్ని రకాల సరుకులంతా జీరో బిల్లులతోనే సాగుతున్నాయి. ఆయా సరుకులన్నీ ప్రతి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు దిగుమతి చేస్తుంటాయి. ఇదంతా పట్టపగలే రోడ్డుపైనే సాగుతున్నా అధికారులకు మాత్రం కనీసం పట్టడం లేదు.
జీఎస్టీ బోర్డులకే పరిమితమా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా ఆదాయాన్ని అందేలా జీఎస్టీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం జీరో దందాకు బ్రేక్ వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడటమే. కానీ భూపాలపల్లి, కాటారం వ్యాపారులు మాత్రం జీఎస్టీ బిల్లును కేవలం బోర్డులకే పరిమితం చేశారనే ఆరోపణలు బహిరంగంగా ఉన్నాయి. ఆయా దుకాణాల్లో, బోర్డులో మాత్రం జీఎస్టీ పిన్ నంబరును రాసి వినియోగదారులకు మాత్రం బిల్లులే ఇవ్వడం లేదు. విద్యావంతులు జీఎస్టీ బిల్లు అడిగితే ’మీకే నష్టం.. వద్దండీ’ అని చెబుతున్నారు. దాంతో వ్యాపారే ఇవ్వడం లేదు కదా అని మాకెందుకులే అంటూ బిల్లు లేకుండానే సరుకులను కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా ఒకటి రెండు పెద్ద షాపింగ్ మాల్స్‌లో మాత్రమే జీఎస్టీ బిల్లులు ఇస్తుండగా, మిగిలిన అన్ని దుకాణాల్లో జీరోతోనే కాలం గడిపేస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు జీఎస్టీ బిల్లుల రూపంలో నష్టం వాటిల్లుతోంది.
జీరో బిల్లు దందాను అరికట్టాల్సిన విజిలెన్స్, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వత్తాసుతోనే బిల్లు లేకుండా దందా సాగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఏళ్లుగా సాగుతున్న జీరో బిల్లు వ్యవహారంపై వాణిజ్య. విజిలెన్స్ అధికారులు అక్రమ వ్యాపారులతో మిలాఖత్ కావడంతోనే స్థానిక వ్యాపారులు అప్రమత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయా శాఖల అధికారులు కొంతమంది అక్రమ వ్యాపారులనే తమ ఏజెంట్లుగా, దళారులుగా పెట్టుకొని మిగిలిన అక్రమ వ్యాపారుల వద్ద నుంచి నెల నెల వసూళ్లు చేసి దండుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వసూళ్ల దందాకు ఆయా శాఖల్లోని కింది స్థాయి అధికారుల పాత్రే కీలకమని తెలుస్తోంది. ఆయా శాఖలకు స్థానికంగా ఉన్న ఓ బడా వ్యాపారి, అధికార పార్టీని అడ్డుపెట్టుకొని దందాకు సహకరించేలా చక్రం తిప్పుతున్నట్లు వ్యాపారులే చెప్పడం గమనార్హం.
రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి
అక్రమ వ్యాపారానికి
అధికారుల వత్తాసు


