రిజర్వేషన్లపై ఉత్కంఠ
మారనున్న వార్డు స్థానాల రిజర్వేషన్లు
వార్డులు 30
ఓటర్లు 52,726
పోలింగ్ స్టేషన్లు 86
భూపాలపల్లి: మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. వార్డుల వారిగా ఓటర్ల జాబితా వెల్లడి కావడంతో రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ వస్తుందో.. చైర్మన్ స్థానం ఏ వర్గాల వారిని వరిస్తుందోనని ఆశావాహులు అంచనాలు వేస్తూ టెన్షన్‌కు గురవుతున్నారు.
చైర్మన్ సీటుపైనే అంతా చర్చ..
కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి గ్రామ పంచాయతీ 25 జనవరి 2012న నగర పంచాయతీగా ఏర్పడింది. అనంతరం జరిగిన 2014, 2020 ఎన్నికల్లో చైర్మన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఈసారి రిజర్వేషన్ల అమలులో మార్పులు జరుగకపోయినప్పటికీ రొటేషన్ పద్ధతిలో చైర్మన్, వార్డు స్థానాల రిజర్వేషన్లు మారనున్నట్లు అనధికారికంగా తెలిసింది. దీంతో భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానం బీసీ జనరల్ లేదా జనరల్ స్థానానికి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్న వారు ఇప్పటి నుంచే పరోక్షంగా ప్రచారంలోకి దిగారు. వార్డుల్లో బరిలో నిలిచే అభ్యర్థులను మచ్చిక చేసుకోవడం, చైర్మన్ స్థానాన్ని తాను ఆశిస్తున్నానని బహిరంగంగానే చెబుతూ సహకరించాలని కోరడం మొదలైంది.
వార్డుల్లోనూ జోరుగా పోటీ..
భూపాలపల్లి మున్సిపాలిటీలో ఈనెల 12 ఓటర్ల తుది జాబితాను మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. 16న ఫొటోలతో కూడిన జాబితాను విడుదల చేయనున్నారు. 30 వార్డులు ఉండగా ప్రధాన పార్టీల నుంచి కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసేందుకు పలువురు ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో వార్డుకు ముగ్గురు, నలుగురు అభ్యర్థులు పార్టీ బీ ఫాం ఆశిస్తుండగా, బీఆర్‌ఎస్‌లోనే దాదాపుగా అదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పోటాపోటీగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు వార్డుల్లో ప్రజల మద్ధతు ఉన్న అభ్యర్థులు, గెలుపు గుర్రాల కోసం అంతర్గతంగా సర్వే చేపిస్తున్నట్లు సమాచారం. తాజా మాజీ కౌన్సిలర్లు, ఓడిపోయిన కౌన్సిలర్లు అధిక సంఖ్యలో మరోసారి ఎన్నికల రంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
నేతల చుట్టూ ప్రదక్షిణలు..
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బస్తీబాట పేరిట పట్టణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి వార్డు కౌన్సిలర్ స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారు తమ నేతల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు.
చైర్మన్ స్థానం రిజర్వేషన్‌పై సర్వత్రా చర్చ
ఆశావహుల్లో టెన్షన్.. టెన్షన్
రిజర్వేషన్లపై ఉత్కంఠ


