జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: జిల్లా ప్రజలందరికి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రతీ ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే గొప్ప పండుగ సంక్రాంతి అన్నారు. కొత్త ఆశలు, కొత్త వెలుగులతో ప్రజలు జీవితాలను ప్రారంభించాలన్నారు. పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు జరుపుకునే ఈ పండుగ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజాన్ని అందించాలని కోరారు. కొత్త ఏడాదిలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే నెలలో జరుగు సరస్వతినది అంత్యపుష్కరాల పనుల ప్రతిపాదనలపై బుధవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ రాహుల్‌శర్మ, రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవిందహరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరాలయం కార్యాలయంలో జిల్లాస్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం ఆయన ఆలయంలో అభిషేక పూజలు చేసి శ్రీశుభానందదేవిని దర్శించుకున్నారు. ఆయనను కండువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
భూపాలపల్లి అర్బన్: నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రంలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు ముగిసినట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. మంగళవారం డీఈఓ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ 159 మంది విద్యార్థులకు 113 హాజరు కాగా.. 46 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ 50 మంది విద్యార్థులకు గాను 46 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరైనట్లు తెలిపారు.
భూపాలపల్లి రూరల్: మానవ నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి కారణాలతో ప్రాణనష్టం జరుగుతుందని ఎస్పీ సంకీర్త్ తెలిపారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా గొల్లబుద్ధారం గ్రామంలో మంగళవారం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా ఎస్పీ హాజరై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ వాహనదారుడు తనతో పాటు ఇతరుల ప్రాణ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రమాదాల కారణంగా వారు ఎదుర్కొంటున్న మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులను వారి అనుభవాల ద్వారానే ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి కిరణ్, భూపాలపల్లి రవాణాశాఖ అధికారి సంధాన్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు


