భూపాలపల్లి/కాళేశ్వరం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పర్యటనకు సోమవారం (నేడు) రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం హెలిపాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా కాళేశ్వరం దేవస్థానం చేరుకుని ముందుగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత కాళేశ్వరం దేవస్థానంలోని తూర్పు ఈశాన్య స్థలంలో రూ.200 కోట్ల వ్యయంతో రాతి నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. కాళేశ్వరాలయం గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
మేడిగడ్డలో జియో ఫిజికల్,
టెక్నికల్ పరీక్షల పరిశీలన..
2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్‌లో 19, 20వ పియర్‌లు, వంతెన కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సీపేజీ లీకేజీలు ఏర్పాడ్డాయి. అప్పటి నుంచి ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో ప్రభుత్వం మరమ్మతులు చేసి నీటిని ప్రజలకు అందించడానికి ముందుకు రావడంతో సీఎం పర్యటన ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో 3.45 గంటలకు హెలికాప్టర్‌లో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజీలో జరుగుతున్న జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు, బోర్‌హోల్స్ పనులను పరిశీలిస్తారు. అక్కడ ఇరిగేషన్‌శాఖ ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గం ద్వార నస్తుర్‌పల్లికి చేరుకుంటారు. 6.30 గంటలకు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. రాత్రి 7.45 గంటల అనంతరం రోడ్డు మార్గం ద్వార వెళ్తారని అధికారులు తెలిపారు.
మూడు చోట్ల హెలిపాడ్‌ల ఏర్పాటు..
సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం దేవస్థానం, మేడిగడ్డ, నస్తుర్‌పల్లిలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మూడు చోట్ల హెలిపాడ్‌లు సిద్ధం చేశారు. కాళేశ్వరం దేవస్థానంలో పూలతో డెకెరేషన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు, భూమిపూజ కోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మేడిగడ్డలో సమీక్ష నిర్వహిస్తుడండంతో అంబట్‌పల్లిలోని గెస్ట్‌హౌస్‌లో ఏర్పాట్లు చేశారు. నస్తుర్‌పల్లిలో సుమారు 40 ఎకరాల్లో సభాప్రాంగణం, విద్యుత్ లైట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్ సిద్దం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, డీఎస్పీ సూర్యనారాయణతో పాటు జిల్లా అధికారుల పనులు పూర్తి చేశారు.
జనసమీకరణ..
కాటారం సబ్‌డివిజన్‌తో పాటు పక్క జిల్లాల నుంచి భారీ ఎత్తున సభకు ప్రజలు, రైతులు తరలి రావడానికి నాయకులు జన సమీకరణ చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు సమకూర్చనున్నారు. భారీగా ప్రజలను సభకు తీసుకురావాలని సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులకు మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు.
రూ.200 కోట్లతో కాళేశ్వరాలయం రాతి నిర్మాణ పనులకు భూమి పూజ
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శన
కాటారం మండలం నస్తుర్‌పల్లిలో రైతు భరోసా నిధుల విడుదల
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు


