రసాయన ఎరువులతో అనర్థాలు! | - | Sakshi
Sakshi News home page

రసాయన ఎరువులతో అనర్థాలు!

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

సమతుల్య ఎరువుల వినియోగంపై విస్తృత ప్రచారం నేటి నుంచి అవగాహన సదస్సులు

యూరియా, డీఏపీ వినియోగంపై ప్రభుత్వం అలర్ట్‌

యాక్షన్‌ ప్లాన్‌ తప్పనిసరి

జనగామ: యూరియా, డీఏపీ ఎరువుల అధిక వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నేల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు కలుగకుండా కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖ అత్యవసర చర్యలు చేపట్టింది. ఈ మేరకు కృషి విజ్ఞాన్‌ కేంద్రాలు, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్లకు విస్తృత అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు. కొన్నేళ్లుగా దేశంలోని ఆయా జిల్లాల్లో యూరియా, డీఏపీ వినియోగం ఎక్కువగా నమోదైందని గుర్తించారు. దీంతో నేలలో పోషక లోపాలు ఏర్పడటం, దీర్ఘకాలికంగా భూమి సారవంతం తగ్గిపోవడం వంటి లక్షణాలను నిర్ధారించారు. ప్రత్యేకంగా వరి ఆధారిత పద్ధతుల్లో నేలల్లో పాస్పరస్‌ నిల్వలు ఎక్కువగా ఉండటం, అదే భూమిలో తిరిగి వరి పంట వేసే సమయంలో శ్రీపాస్పరస్‌ అప్లికేషన్‌శ్రీ నిలిపివేయాలని శాసీ్త్రయ సిఫార్సులున్నాయని జీఓలో స్పష్టం చేసింది.

కృషి విజ్ఞాన్‌ కేంద్రాలు, ఆత్మ ప్రాజెక్టు ద్వారా రైతులకు కాంప్లెక్సులు, ఎస్‌ఎస్‌పీ వాడకాన్ని ప్రోత్సహిస్తూ, యూరియా, డీఏపీపై ఆధారపడకుండా శాసీ్త్రయ సూచనల ప్రకారం ఎరువులు ఎంచుకోవాల్సిందిగా రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. బయో ఫర్టిలైజర్స్‌, ఆర్గానిక్‌, మైక్రోన్యూట్రి ఝెంట్స్‌ వినియోగంపై ప్రదర్శనలు, డెమోలను నిర్వహిస్తారు. రైతు శిక్షణ కార్యక్రమాలు, గ్రూప్‌ మీటింగ్స్‌, యూరియా, డీఏపీ అధిక వినియోగంతో కలిగే నష్టాలు, సమతుల్య ఎరువుల లాభాలు ఎలా వస్తాయనే దానిపై తెలియజేస్తారు. మట్టి పరీక్షల కార్డు సిఫార్సుల మేరకు ఎరువుల ఎంపికపై సూచనలు ఇస్తారు. అవగాహన సదస్సుల్లో వ్యవసాయం సాగుపై పురోగతి సాధిస్తున్న రైతులు, ఎఫ్‌పీఓలు, ఇన్‌పుట్‌ డీలర్లు వంటి వర్గాలను భాగస్వామ్యం చేస్తారు.

జిల్లాలో రాబోయే వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో పంటల సాగు సమయంలో యూరియా సమర్థవంతమైన వినియోగంపై రైతులకు విస్త్రృత అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 176 రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), ఆత్మ సిబ్బంది, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కలిసి రైతులకు మార్గనిర్దేశం చేయనున్నారు. యూరియాను అధికంగా వాడటంతో నేల నాణ్యత తగ్గిపోవడం, పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటం వంటి అంశాలపై రైతులకు వివరించనున్నారు. సమతుల్య ఎరువుల వినియోగం, నేల పరీక్షల ప్రాముఖ్యత, నానో యూరియా వినియోగం వంటి విషయాలపై కూడా అవగాహన కల్పిస్తారు. జిల్లాలోని 12 మండలాల్లో నేటి నుంచి 29 వరకు గ్రామాల వారీగా కార్యక్రమాల తేదీలను ఖరారు చేశారు. ప్రతీ గ్రామంలో నిర్వహించే ఈ సదస్సుల్లో రైతులతో నేరుగా చర్చలు జరిపి, వారి సందేహాలకు సమాధానాలు ఇస్తారు. యూరియా వినియోగంలో నియంత్రణ పాటిస్తే ఖర్చులు తగ్గి, పంటల దిగుబడి పెరుగుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రైతుల్లో శాసీ్త్రయ వ్యవసాయంపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.

సమతుల్య ఎరువుల వాడకంపై

అవగాహన

నేటి నుంచి జిల్లావ్యాప్తంగా సదస్సులు

మట్టి పరీక్షల ఆధారంగా

ఎరువులు ఎంపిక

నానో యూరియా ప్రాముఖ్యతపై శిక్షణ

అధిక యూరియా, డీఏపీ వినియోగం ఉన్న గ్రామాలు, బ్లాకుల కోసం జిల్లా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, రాబోయే పంట సీజన్‌ ప్రారంభానికి ముందు అమలు చేయాల్సింటుంది. రైతులకు అధిక యూరియా, డీఏపీ వాడకం నేలను దెబ్బతీస్తుందని, అయితే ఎస్‌ఎస్‌పీ వాడటంతో నేల ఆరోగ్యం, పోషక సమతుల్యత, పంట దిగుబడులు మెరుగవుతాయని స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement