రఘునాథపల్లి: హిందూ ధర్మరక్షణకు అందరూ ఐక్యంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ సునీత రామ్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రఘునాథపల్లి మండలం నిడిగొండలో ఆదివారం హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫతేషాపూర్, భాంజీపేట, లక్ష్మితండా, రామచంద్రగూడెం, ఇబ్రహీంపూర్, శ్రీమన్నారాయణపురం, రఘునాథపల్లి, కన్నాయపల్లి, గబ్బెట గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది హిందూ బంధువులు సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతరామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను నేటి తరానికి చేరవేయడం అవసరమన్నారు. అంతకుముందు శ్రీలక్ష్మినృసింహ ఆలయం నుంచి అంజనేయస్వామి విగ్రహంతో భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. సర్పంచ్ బొమ్మ వీరస్వామిగౌడ్, కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిల్కూరి రేణుక, గైని శ్రీనివాస్‌గౌడ్, ఎలపాటి రాంరెడ్డి, కోశాధికారి కాట మహేష్, బొంగు శ్రీధర్, కొంగరి నర్సింగరావు, పెసరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలను
నిరోధించాలి
జనగామ రూరల్: బాల్య వివాహాలను నిరోధించడం ప్రతీఒక్కరి బాధ్యతని స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ (స్కోప్) డైరెక్టర్ బండి సాయన్న అన్నారు. ఆదివారం పట్టణంలో స్కోప్ సంస్థ విజిలెన్స్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణకు కృషి చేయాలన్నారు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం బాల్య వివాహాల్లో పాల్గొనే వారికి కూడా శిక్ష విధించబడతాయన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రమాణాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆశలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సంస్థ ప్రతనిధితులు పాల్గొన్నారు.
న్యూశాయంపేట: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, ఆర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) రీజినల్ కో–ఆ ర్డినేటర్ జంగా సతీశ్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న (5 నుంచి 8వ తరగతి) విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణలో భాగంగా పదిరోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంప్‌ను ఆదివారం వరంగల్ శంభునిపేట, వరంగల్(జి2) గురుకులంలో ప్రారంభించారు. ప్రిన్సిపాల్ తాళ్ల నీలిమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జంగా సతీశ్ మాట్లాడుతూ.. సమ్మర్‌క్యాంపునకు బాలికలకు, శంభునిపేట గురుకులంలో, బాలురకు జక్కలొద్ది గురుకులంలో సౌకర్యాలు కల్పించి పదిరోజుల పాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు సయ్యద్ అక్బర్, మక్బూల్‌పాషాతో పాటు, పీఈటీలు, ఆర్ట్స్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
22 నుంచి సమ్మెకు సిద్ధం
నయీంనగర్: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్ ఆవరణలోని వరంగల్–1 డిపో ఎదుట రీజియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. నాయకులు ఎం.శ్రీనివాస్, యాకస్వామి, టి.శ్రీనివాస్, జీఎస్.పాణి, కార్మికులు పాల్గొన్నారు.


