ధాన్యం కొనుగోళ్లు ఇక వేగంగా..
జనగామ: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను నివారించేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈసారి ధాన్యం కొనుగోలుకు ముందుగా ‘రైతు టోకెన్ స్లిప్పు’ అనే నూతన విధానాన్ని కలెక్టర్ ప్రవేశపెట్టారు. జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా, ఇందులో ఐకేపీ 169, పీఏసీఎస్ 67 ఉన్నాయి.
ఇంతకుముందు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత తేమ శాతం పరిశీలించి టోకెన్ ఇవ్వడం వల్ల ఆలస్యం, రద్దీ వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఇప్పుడు టోకెన్ విధానాన్ని మూడు దశలకు విస్తరించారు. గతంలో ఒకే స్లిప్ ఉండగా, ప్రస్తుతం ఒకే స్లిప్‌లో మూడు టోకెన్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి రైతుకు, మరొకటి ఏఈఓకు, ఇంకొకటి కొనుగోలు కేంద్రం నిర్వాహకుల వద్ద ఉంటుంది. ఈ టోకెన్లలో ధాన్యం రకం, కోత తేదీ, అంచనా దిగుబడి (క్వింటాళ్లలో), కొనుగోలు కేంద్రం, మండలం, ధాన్యం తీసుకు రావాల్సిన తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి.
ఏఈఓలు ప్రతీ గ్రామానికి వెళ్లి రైతులు ఎప్పుడు కోతలు కోస్తున్నారో తెలుసుకొని, కోత అనంతరం ధాన్యాన్ని సెంటర్‌కు ఎప్పుడు తీసుకురావాలో టోకెన్‌లో నమోదు చేసి రైతులకు అందజేస్తున్నారు. ఇప్పటికే సెంటర్‌లో ఉన్న ధాన్యానికి సంబంధించిన రైతులకు కూడా అక్కడికే వెళ్లి టోకెన్లు ఇస్తున్నారు.
రైతులు టోకెన్‌లో పొందుపరిచిన తేదీ రోజున సెంటర్‌కు ధాన్యం తీసుకురావాలి. అక్కడ నిర్వాహకులు కేటాయించిన క్రమసంఖ్య ప్రకారం మాత్రమే కొనుగోలు జరుగుతుంది. తేమశాతం నిబంధనలకు అనుగుణంగా ఉంటే రైతులకు ఆలస్యం లేకుండా కొనుగోలు పూర్తవుతుంది.
ధాన్యం విక్రయ సమయంలో రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, అమల్లో ఉన్న బ్యాంకు పాస్‌బుక్ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. రైతులు ముందుగానే సెంటర్‌కు వచ్చిరోజుల తరబడి వేచి ఉండకుండా, సమయ పాలనతో ధాన్యం విక్రయం జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
వినూత్న టోకెన్ విధానాన్ని నిర్వాహకులు సమర్థంగా అమలు చేస్తే యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏఈఓలు ఊరూరా తిరిగి రైతుల వివరాలు నమోదు చేస్తూ రశీదులు అందజేస్తున్నారు.
మూడు దశల టోకెన్ విధానం
ఒకే స్లిప్‌లో మూడు టోకెన్లు
టోకెన్ ఇచ్చే బాధ్యత ఏఈఓలదే..
రాష్ట్రంలోనే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తొలి ప్రయత్నం
జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు
సెంటర్లు


