ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత కోసం కలెక్టర్ కార్యాలయం మార్గదర్శకత్వంలో రైతులకు ప్రత్యేక టోకెన్లు జారీ చేస్తున్నారు. రైతు విక్రయానికి సంబంధించిన ప్రతీ వివరాలను నమోదు చేయడానికి ఈ టోకెన్ ఉపయోగపడుతుంది. టోకెన్‌పై రైతు నుంచి తీసుకునే ధాన్యం, వ్యక్తిగత సమాచారం, భూసంబంధిత వివరాలు, ధాన్యం రకాలు, తూకం వివరాలు అన్నీ స్పష్టంగా చేయాల్సి ఉంటుంది. టోకెన్‌లో బుక్ నెంబర్, జారీ చేసిన తేదీ, రైతు, తండ్రి లేదా భర్త పేరు, గ్రామం, పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్, ఆధార్ చివరి నాలుగు అంకెలు, సర్వే నెంబర్ లేదా ఖాతా నెంబర్, భూమి స్వభావం, పంట రకం (ధాన్యం/సన్న/దొడ్డు) వంటి అంశాలు నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. అలాగే రైతు విక్రయించే ధాన్యం మొత్తాన్ని తూకం చేసిన తర్వాత వచ్చిన మొత్తం బరువు, కేంద్ర కోడ్, మండలం, తదితర వివరాలు కూడా స్పష్టంగా నమోదు చేసి రైతుకు అందజేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన విధానంలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేవడంలో ఈ టోకెన్ తప్పనిసరి అని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. టోకెన్‌లోని ఈ వివరాల ఆధారంగానే ధా న్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.


