‘పరిషత్‌‘ ఎన్నికలకు పచ్చజెండా! | - | Sakshi
Sakshi News home page

‘పరిషత్‌‘ ఎన్నికలకు పచ్చజెండా!

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వేళయ్యింది. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని శనివారం జిల్లా కలెక్టర్‌లకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలలోనే ‘పరిషత్‌’ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహించిన ప్రభుత్వం.. ‘పరిషత్‌’ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రక్రియ పూర్తయితే వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ నెల 23వ తేదీలోపే ఓటర్ల జాబితా...

2025, జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్‌లకు జారీ చేసిన అదేశాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని ఆదేశించింది. వీటి ఆధారంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్‌ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలను రూపొందించాలని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ధ్రువీకరణ అనంతరం, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) యూజర్‌ మాన్యువల్‌ సూచనల ప్రకారం పోలింగ్‌ సెంటర్లకు అనుసంధానించాలని పేర్కొంది. ఆ డేటాలో ఏవైనా తేడాలున్నట్లు గమనిస్తే, వాటిని ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 23వ లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. 23 తర్వాత అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను విడుదల చేసి, ఆ తర్వాత పోలింగ్‌ సెంటర్లు, బ్యాలెట్‌ బాక్స్‌లు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు.

‘పరిషత్‌’లో ‘ఆమె’కే ప్రాధాన్యం...

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మొత్తం 30,43,540 మంది ఓటర్లు ఉంటే, అందులో పురుషులు 14,89,606 కాగా, మహిళ ఓటర్లు 15,51,289 మంది ఉన్నారు. ఇతరులు(థర్డ్‌జెండర్‌) 504 కాగా, సర్వీసు ఓటర్లు 2141. ఆరు జిల్లా ప్రజా పరిషత్‌లు ఉండగా ములుగు ఎస్టీ మహిళ, హనుమకొండ, జనగామలు ఎస్సీ మహిళకు కేటాయించారు. అదే విధంగా 75 జెడ్పీటీసీలకు గాను 38, 39 ఎంపీపీ స్థానాలను మహిళలకు దక్కనున్నాయి. అలాగే 778 ఎంపీటీసీ స్థానాల్లో 399 చోట్ల మహిళలకే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనాలు చెబుతున్నాయి.

ప్రయత్నాలు మొదలెట్టిన ఆశావహులు..

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ‘పరిషత్‌’ సందడి మొదలైంది. వాస్తవానికి 2025 సెప్టెంబర్‌లో ఈ ఎన్నికలు జరుగుతాయని భావించినా రిజర్వేషన్‌లు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలతో ఆశావహులు కొందరు సరిపెట్టుకోగా.. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ పదవులపై కన్నేసిన మరికొందరు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. తాజాగా ఓటర్ల ముసాయిదా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల్లో సందడి మొదలైంది. మేలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు ఆయా పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసే పనిలో పడ్డారు.

మేలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి

ఈ నెల 23లోపు ఓటర్ల ముసాయిదా జాబితా

సిద్ధం చేయాలని కలెక్టర్‌లకు

ఎస్‌ఈసీ ఆదేశం

ముసాయిదా జాబితాపై అధికారుల కసరత్తు

రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి... మహిళలకు భారీగా అవకాశాలు

మొత్తం జిల్లాలు 06

జెడ్పీటీసీలు 75

జెడ్పీపీపీలు

06

ఎంపీపీలు 75

ఎంపీటీసీ స్థానాలు 778

జిల్లా జెడ్పీపీపీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు

హనుమకొండ 1 12 12 129

వరంగల్‌ 1 11 11 130

జేఎస్‌భూపాలపల్లి 1 12 12 109

మహబూబాబాద్‌ 1 18 18 193

ములుగు 1 10 10 83

జనగామ 1 12 12 134

Advertisement
 
Advertisement
Advertisement