ముగిసిన ఎస్‌ఏ–2 పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎస్‌ఏ–2 పరీక్షలు

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

జనగామ: జిల్లాలో ఎస్‌ఏ–2 వార్షిక పరీక్షలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కాగా, శనివారంతో ముగిశాయి. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. విద్యాశాఖ సూచనల మేరకు ఈ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 22వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం 23వ తేదీన విద్యార్థులకు మార్కుల షీట్లు, ప్రోగ్రెస్‌ కార్డులు అందజేయనున్నారు. అలాగే అదేరోజు పాఠశాలల్లో పేరెంట్‌, టీచర్‌ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభ, పురోగతి గురించి తల్లిదండ్రులకు వివరించాలని పేర్కొన్నారు. వేసవి సెలవుల సమయంలో పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని కూడా విద్యాశాఖ సూచించింది. జిల్లాలో 341 ప్రాథమిక పాఠశాలలు, 64 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉండగా, సుమారు 28 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

టెక్నికల్‌ సమస్యలను అధిగమిస్తాం

జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టెక్నిక్‌ సమస్యలు పరిష్కారమైన వెంటనే పూర్తి స్థాయి ఇ–నామ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పూర్తిస్థాయి లావాదేవీలను కొనసాగిస్తామని మార్కెట్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అంజిత్‌ రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇ–నామ్‌ మొరాయింపు’ శీర్షికన ఈ నెల 16న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఇ–నామ్‌ సాఫ్ట్‌వేర్‌ 1.0ను అప్‌డేట్‌ తర్వాత 2.0 వెర్షన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ అప్‌డేషన్‌ కారణంగా కొన్ని టెక్నికల్‌ సమస్యలు ఎదురవుతున్నాయని, వాటి కారణంగా సాఫ్ట్‌వేర్‌ ద్వారా పూర్తిస్థాయి వ్యాపార లావాదేవీలు నిర్వహించలేకపోతున్నామని తెలిపారు. అయితే రైతులు మార్కెట్‌ యార్డ్‌కు తీసుకొచ్చే ప్రతీ పంటకుప్పకు ఇ–నామ్‌ ద్వారానే లాట్‌ ఐడీలు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేర్‌లో టెక్నికల్‌ లోపాల వల్ల ఈ లాట్‌ ఐడీలు ట్రేడర్ల లాగిన్‌లో కనిపించకపోవడంతో, తాత్కాలికంగా మాన్యువల్‌, సీక్రెట్‌ బిడ్డింగ్‌ విధానాన్ని అనుసరించడం తప్పనిసరి పరిస్థితిగా మారిందని పేర్కొన్నారు. లాట్‌ ఐడీల ఆధారంగా యార్డ్‌లో క్లోజ్డ్‌ టెండర్‌ విధానంలో అత్యధిక రేటు చెప్పిన ట్రేడర్‌కి పంట ఉత్పత్తిని కేటాయిస్తున్నామని, రైతులకు ఈ ప్రక్రియను పూర్తిగా వివరించడం జరుగుతుందని తెలిపారు.

ఆర్టీసీ డ్రైవర్లకు సన్మానం

జనగామ రూరల్‌: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం సుదీర్ఘ కాలం యాక్సిడెంట్‌ ఫ్రీ డ్రైవర్లుగా రికార్డు కలిగిన ఇద్దరు డ్రైవర్లు ఎ.కిషన్‌, డి.పాల్‌ను జనగామ డిపోలో వరంగల్‌ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ కె. భానుకిరణ్‌ సన్మానించారు. అలాగే డిపోలో పనిచేస్తున్న మహిళా కండక్టర్‌ పి.ఉమామహేశ్వరి కుమార్తె ఎస్‌. జెస్సికా ఇటీవల వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో 985/1000 మార్కులు సాధించగా ఆమెను, తల్లిదండ్రులను సన్మానించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ ఎస్‌. స్వా తి, సూపర్‌ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ముగిసిన ఉప్పల మల్లన్న జాతర

దేవరుప్పుల: మండల కేంద్రంలోని ఉప్పల మల్లన్న జాతర వసంతోత్సవంతో ఘనంగా ముగిసింది. శనివారం తెల్లవారుజామున వాగులో పద్మశాలీలు దోపోత్సవం నిర్వహించి ఆటపట్టు నిర్వహించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో పూజారి పెద్దాపురం వెంకటేశ్వరశర్మ, అగ్నిగుండాల నిర్వహుకులు బిట్ల కొండయ్య, సర్పంచ్‌ పెద్ది కృష్ణమూర్తిగౌడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండాలను హరహర మహాదేవా...శివనామస్మరణంతో భక్తులు దాటి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం దేవతమూర్తుల పల్లకీ మోసిన చేనేత కార్మికులు రంగులు చల్లుకుంటూ ప్రజలతో వసంతోత్సవం నిర్వహించారు. ఏకాంత సేవలు, రుత్విక్‌ సన్మానంతో జాతర ముగింపు పూజలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement