జనగామ: పట్టుగూళ్ల ధరలు తగ్గించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని పట్టు పరిశ్రమల శాఖ కార్యాలయం వద్ద రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు చెందిన రైతులు శనివారం వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. సిద్దిపేట, వరంగల్, సూర్యాపేట, కరీంనగర్, ఖమ్మం, పెద్దపల్లి తదితర జిల్లాల నుంచి వచ్చిన సుమారు 30 మంది రైతులు తమ పట్టుగూళ్లను విక్రయించేందుకు జనగామ మార్కెట్‌కు వచ్చారు. అనంతరం వారు మాట్లాడారు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపూర్ మార్కెట్‌లో కిలో పట్టుగూళ్ల ధర సగటున రూ.670 వరకు ఉండగా, జనగామలో వ్యాపారులు రూ.550 మాత్రమే ఇస్తామని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోకు రూ.120 తక్కువ ధర ఎలా నిర్ణయిస్తారని రైతులు వ్యాపారులను ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగారు. రెండు ఎకరాల్లో పట్టు సాగు చేయడానికి నెలకు సుమారు రూ.50 వేల వరకు ఖర్చవుతుందని, కానీ దిగుబడి సుమారు 100 కిలోలకే పరిమితమవుతుందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌లో ధరలు తగ్గించడం వల్ల పెట్టుబడులు కూడా తిరిగి రాకుండా పోతున్నాయని రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి వచ్చిన రైతులు పన్యాల దుర్గారెడ్డి, ఐలయ్య, శ్రీనివాస్, రామస్వామి, రమేశ్ శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్ రెడ్డి, గోవిందరాజు, అశోక్, పుల్లయ్య వాపోయారు. ధరలను తగ్గించడంతో నెల రోజుల పాటు కష్టం చేసినా లాభం లేకపోవడం బాధాకరమన్నారు. ధరల తగ్గింపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
హైవేపై ధర్నా
రైతులు తీసుకొచ్చిన పట్టుగూళ్లతో రహదారిపైకి దిగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వ్యాపారులు కిలోకు రూ.30 పెంచుతామని సూచించగా, రైతులు కనీసం రూ.50 పెంచితేనే విక్రయిస్తామని పట్టుబట్టారు. ఈ వివాదం పరిష్కారం కాకపోవడంతో రైతులు సుమారు గంట పాటు ఎండలోనే రహదారిపై ధర్నా కొనసాగించారు.
వరంగల్–హైదరాబాద్ హైవేపై
రైతుల ధర్నా
కిలోకు రూ.120 ఎలా తగ్గిస్తారంటూ ఆవేదన


