జనగామ: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ చేపట్టిన రోడ్డు భద్రతా అవగాహనపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. ఆర్టీసీ చౌరస్తా పోలీస్ కంట్రోల్ రూం పరిసరాల్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ మార్గదర్శకత్వంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో నెల్లుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో యమధర్మరాజు, చిత్రగుప్తుల పాత్రలతో నాటక ప్రదర్శన జరిగింది. హెల్మెట్, సీట్‌బెల్ట్, డ్రంకెన్ డ్రైవ్ వంటి ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా నాటక ప్రదర్శన చేశారు. నాటక సారాంశాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ వివరిస్తూ.. ‘హెల్మెట్ పెట్టుకుంటే యముడు మన దగ్గరకు రాలేడు.. ఇదే మా కాన్సెప్ట్’ అని అన్నారు. రోడ్డు ప్రమాదాలు లేకుండా, మరణాలు తగ్గిన జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు భరత్, చెన్నకేశవులు, నర్సయ్య, రతీష్, నెల్లుట్ల ఫౌండేషన ప్రతినిధి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన
యముడు, చిత్రగుప్తుడు, భటులతో నాటక ప్రదర్శన


