కల్లాల్లో కుప్పలు | - | Sakshi
Sakshi News home page

కల్లాల్లో కుప్పలు

Apr 18 2026 7:41 AM | Updated on Apr 18 2026 7:41 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌/ దేవరుప్పుల: అమ్మబోతే అడవి.. అన్నట్లుగా తయారైంది ధాన్యం రైతుల పరిస్థితి. జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం, వైపు.. కొనుగోలు కేంద్రాలు ఉన్నచోటా కాంటాలు వేయక ఆలస్యం..ఓ వైపు, అకాల వర్షాల భయం మరోవైపు..ఇలా అన్నదాతలు అరిగోస పడుతున్నారు.

కొనుగోలు కేంద్రాలేవి?

నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల పరిధిలో అదును దాటుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. దీంతో వరిపంటలు కోతలు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల పరిధిలో ఇప్పటికే దాదాపు 40 శాతానికి పైగా వరికోతలు పూర్తయ్యాయి. వరికోతలు చేసిన రైతులు ధాన్యాన్ని తమ వ్యవసాయ క్షేత్రాల్లో, ఐకేపీ సెంటర్లలోని కల్లాల్లో కుప్పలుగా పోసుకున్నారు. అయితే ప్రతీరోజు ఉదయం, సాయంత్రం ఈదురుగాలులతో మబ్బులు ఊరిస్తుండగా వర్షం కురుస్తుందనే గుబులుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొద్దంతా ధాన్యాన్ని ఆరబోసి సాయంత్రం కాగానే కుప్పగా చేసి పరదాలు కప్పుకుంటున్నారు. అయితే ఎంతగా పరదాలు కప్పినా పెద్దవాన వస్తే రైతులకు తిప్పలు తప్పవు. అయితే గత యాసంగి సీజన్‌లో ఇప్పటికే సెంటర్లు ప్రారంభించగా ఈ సారి జాప్యం చేస్తుండగా రైతులు అరిగోస పడుతున్నారు.

సెంటర్లలో కుప్పలుగా..

మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ముందుగానే ధాన్యం రాశులుగా పోసుకున్నారు. ప్రధానంగా నమిలిగొండ, శివునిపల్లి, ఇప్పగూడెం, పాంనూర్‌, తానేదార్‌పల్లి, విశ్వనాథపురం, సముద్రాల తదితర గ్రామాల్లో మెజార్టీ రైతులు ఇప్పటికే వరికోతలు కోసి ధాన్యాన్ని సెంటర్ల వద్దకు తరలించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

సర్కార్‌ జాప్యం..ధాన్యం రైతులకు కష్టం

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇంకెప్పుడు?

దేవరుప్పులలో కాంటాలు వేయక

పేరుకుపోయిన వడ్లు

కొనుగోళ్ల సమస్యలు పరిష్కరించాలని అన్నదాతల వేడుకోలు

Advertisement
 
Advertisement
Advertisement