● ఎమ్మెల్యే పల్లా పిలుపుతో ‘బెల్ట్’ తీసేందుకు ముందుకొచ్చిన కాలనీ
● 11వ వార్డులో ఏకగ్రీవ తీర్మానం..
ఫ్లెక్సీల ప్రదర్శన
జనగామ: పట్టణంలోని 11వ వార్డులో బెల్ట్ షాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, మహిళలు అనధికార మద్య దుకాణాలను మూసివేయాలని శుక్రవారం ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వార్డు కౌన్సిలర్ ఎనగందుల అనూషకృష్ణ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు కలిసి సమస్యపై చర్చించి తక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇళ్ల మధ్యలో ఉన్న బెల్ట్ షాపుల వల్ల రోజువారీగా కుటుంబాలకు సమస్యలు, గొడవలు, అసౌకర్యాలు పెరుగుతున్నాయని తమలోని ఆవేదన వెల్లగక్కారు. యువత మద్యానికి బానిసవుతుండటం, కుటుంబాలు చిన్నాభిన్నం కావడం సామాజికంగా తీవ్ర ప్రభావం చూపుతుందన్న కారణంతో బెల్ట్ దుకాణాల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు.
వాడవాడలా ఫ్లెక్సీలు
వార్డు ప్రజల్లో బెల్ట్ దుకాణాలపై అవగాహన కల్పిస్తూ, మహిళా సంఘాలు మద్యపానం వద్దు.. కుటుంబ బాధ్యత ముద్దు నినాదంతో కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. కౌన్సిలర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముందడుగు జిల్లాకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వార్డులో ఉన్న బెల్ట్ దుకాణాలను మూసివేయగా, వాటిపై నిరంతరం నిఘా ఉంచారు.
ఇదే స్ఫూర్తితో ముందుకు..
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని మహిళా సంఘాలతో కలిసి 11వ వార్డులో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాం. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపుతో బెల్ట్ షాపుల మూసి వేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాం.
–ఎనగందుల అనూషకృష్ణ,
కౌన్సిలర్,11వ వార్డు


