● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: గోల్డెన్ అవర్‌లో ప్రాణాలను కాపాడవచ్చని, రోడ్డు ప్రమాదాల సమయంలో డ్రైవర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ’అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ‘గోల్డెన్ అవర్‘ అంశంపై డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోకుండా, బాధితులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు సీపీఆర్ చేసే విధానాన్ని వైద్యాఽధికారులు రవి కృష్ణ, సరిత, అలాగే 108 సేవలపై 108 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాము, అదే విధంగా రాహవీర్ పథకం, పీఎం రాహత్ పథకాలపై ఐఆర్‌ఏడీ డీఎం టీ శివప్రసాద్ డ్రైవర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి, పూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున రావు, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
సుస్థిర పద్ధతులపై దృష్టి సారించాలి
సుస్థిర వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన పథకం అమలుపై టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, ఉద్యానశాఖ అధికారి రవికాంత్, పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్ రావు, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మూర్తి, కేవీకే మామ్నూర్ శాస్త్రవేత్త, నాబార్డ్ ఏజీఎం అధికారులు తదితరులు పాల్గొన్నారు.


