తండ్లాట లేకుండా తాగునీరు! | - | Sakshi
Sakshi News home page

తండ్లాట లేకుండా తాగునీరు!

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

52 ప్రాంతాలకు

సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌:

జనగామ: జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. సిద్దిపేట జిల్లా మంగోలు నీటి శుద్ధి కేంద్రం, ధర్మసాగర్‌ వనరులను వినియోగిస్తూ మిషన్‌ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు నిరంతర నీటి సరఫరా కొనసాగుతోంది. వేసవి కాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

1,28,39 ట్యాప్‌ కనెక్షన్లు..

జిల్లాలోని 12 మండలాల పరిధిలో 1,28,39 ట్యాప్‌ కనెక్షన్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తున్నారు. మంగోలు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(డబ్ల్యూటీపీ) నుంచి రోజుకు 54.16 ఎంఎల్‌డీ నీటిని 827 ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇందులో 11 మండలాలకు మంగోలు వాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంటు నుంచి తాగునీరు చేరుతుండగా, జఫర్‌గఢ్‌ మండలానికి మాత్రం ధర్మసాగర్‌ నుంచి రోజుకు 25 ఎంఎల్‌డీ నీటిని పంపిస్తున్నారు. ఈ విధంగా రెండు ప్రధాన వనరులను సమన్వయంతో వినియోగించడం వల్ల సరఫరా వ్యవస్థలో స్థిరత్వం కొనసాగుతోంది. మిషన్‌ భగీరథకు తోడుగా గ్రామీణ ప్రాంతాల్లో 1,030 త్రీఫేజ్‌ బోర్లు, 830 సింగిల్‌ ఫేజ్‌ బోర్లు, 64 ఓపెన్‌ బోర్‌వెల్స్‌, 638 చేతిపంపులు కూడా పనిచేస్తూ గ్రామాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులుగా నిలుస్తున్నాయి.

వేసవిలో ముందస్తు అంచనా

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ భూగర్భ జలాల స్థాయి పడిపోవడం సహజమే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఏప్రిల్‌తో పాటు మే, జూన్‌ నెలల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న 52 ప్రాంతాలను అధికారులు ముందుగానే గుర్తించారు. చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, రఘునాథపల్లి, జఫర్‌గఢ్‌, బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లోని ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా తరిగొప్పుల, దేవరుప్పుల, కొడకండ్ల, జనగామ మండలాల్లో అధిక సంఖ్యలో సమస్యాత్మక గ్రామాలు ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు.

సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం

వేసవి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాల మేరకు మిషన్‌ భగీరథ ఇంట్రా విభాగం అధికారులు సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు. అదనపు బోర్లను అద్దెకు తీసుకోవడం, అందుబాటులో ఉన్న వనరులను మరమ్మతులు చేయడం వంటి చర్యలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. గ్రామాల వారీగా రోజువారీ నీటి సరఫరాను అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. పైప్‌లైన్‌ లీకేజీలు, మోటార్ల సమస్యలు వంటి అంశాలను గుర్తించి సర్పంచులతో కలిసి వెంటనే పరిష్కరిస్తున్నారు. ఇక మిషన్‌ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికే కాకుండా జనగామ చంపక్‌హిల్స్‌ మాత శిశు సంరక్షణ కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు కూడా నీరు సరఫరా చేయడం ప్రజారోగ్య పరిరక్షణకు దోహదం చేస్తోంది. ముందస్తు ప్రణాళిక, సమన్వయంతో పనిచేస్తున్న అధికారులు ఈ వేసవిలో తాగునీటి సమస్యలను గణనీయంగా తగ్గించగలరని ఆశాభావం వ్యక్తమవుతోంది.

జనగామకు 1 ఎంఎల్‌డీ..

జనగామ పురపాలిక పరిధిలోని 30 వార్డులకు చీటకోడూరు రిజర్వాయర్‌ నుంచి రోజువారీగా తాగునీటి సరఫరా జరుగుతోంది. మిషన్‌ భగీరథ నుంచి 1 ఎంఎల్‌డీ తాగునీటిని ఇందులో కలిపి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీకి 4 ఎంఎల్‌డీ వాటర్‌ సప్లై చేస్తున్నారు. ప్రస్తుతం రెండు మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి ఎద్దడి లేకున్నప్పటికీ, భవిష్యత్‌లో ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలను తయారు చేసుకున్నారు.

మండలం గ్రామాలు

చిల్పూరు 4

స్టేషన్‌ఘన్‌పూర్‌ 1

రఘునాథపల్లి 2

జఫర్‌గఢ్‌ 2

బచ్చన్నపేట 1

జనగామ 7

నర్మెట 3

తరిగొప్పుల 13

దేవరుప్పుల 8

కొడకండ్ల 8

పాలకుర్తి 3

జిల్లాలో కొరత ఏర్పడకుండా అధికారుల సన్నద్ధత

మంగోలు, ధర్మసాగర్‌ డబ్ల్యూటీపీ నుంచి సరఫరా

జిల్లాలో 1.28లక్షల ట్యాపులు

ప్రతీరోజు 54.16 ఎంఎల్‌డీ వాటర్‌ సప్లై

సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారు

Advertisement
 
Advertisement
Advertisement