సెలవుల్లో బడి భద్రత! | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో బడి భద్రత!

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

జనగామ: వేసవి నేపథ్యంలో ఈ నెల 23న పాఠశాలలు విద్యా సంవత్సరం ముగుస్తుండగా, 24వ తేదీ నుంచి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పాఠశాలల మౌలిక వసతులు, రికార్డులు, భద్రతా వ్యవస్థలను కాపాడేందుకు సమగ్ర శిక్ష, తెలంగాణ ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. డీఈఓలు, హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ అధికారులకు పంపించిన ఆదేశాల్లో పాఠశాలల సెలవుల్లో సురక్షితంగా ఉండేలా 20 విభాగాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పీఎంశ్రీ, సమగ్ర శిక్ష నిధుల ద్వారా పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, సంగీత పరికరాలు, బ్యాండ్‌ సామగ్రి, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌, క్రీడా పరికరాలు, లైబ్రరీ వసతులు, ఒకేషనల్‌ సాధనాలు, మధ్యాహ్న భోజన వంటగదుల సదుపాయాలు, ఫర్నిచర్‌ వంటి అనేక వసతులు కల్పించారు. వీటి రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డీఈఓలకు సూచించారు. స్కూల్‌ ప్రాపర్టీ, రికార్డులు, మౌలిక వసతులు ఏ విధమైన ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

జిల్లాలో విద్యాసంస్థలు

జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, మోడల్‌, కేజీబీవీ, సోషల్‌ వెల్ఫేర్‌, మైనార్టీ, బీసీ వెల్ఫేర్‌, ట్రైబల్‌ తదితర విద్యాసంస్థలు సుమారు 543 ఉండగా, 40వేల మంది పిల్లలకు పైగా చదువుకుంటున్నారు. ఇందులో పీఎంశ్రీ స్కూల్స్‌ 15 ఉండగా, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని పాఠశాలలకు విలువైన పరికరాలు, ఇతర వస్తువులు మంజూరు చేశారు.

అలర్టు

పాఠశాలల సమగ్ర భద్రతలో భాగంగా స్కూల్‌ గేట్లు, తరగతి గదులు, ల్యాబ్‌లు పూర్తిగా లాక్‌ చేయడం, స్థానిక పోలీసుల పర్యవేక్షణ, పూర్వ విద్యార్థులు, యువత, ఎన్జీఓల సహకారం తీసుకోవాలని సూచించారు. విలువైన పరికరాలను లాకబుల్‌ రూముల్లో భద్రపరచడం, ఆస్తుల ఇన్వెంటరీని అప్‌డేట్‌ చేయడం, అనధికారుల ప్రవేశాన్ని నియంత్రించడం తప్పనిసరి చేయాలన్నారు. విద్యుత్‌ ప్రమాదాలను నివారించేందుకు పరికరాలు, మెయిన్‌ పవర్‌ స్విఛ్‌ఆఫ్‌ చేయడం, లోపాలున్న వైరింగ్‌ను ముందుగానే సరిచేయాలని పేర్కొన్నారు. నీరు, శుభ్రత, హైజీన్‌ పరంగా టాయిలెట్లు, నీటి ట్యాంకులు శుభ్రపరచడం, లీకేజీలు లేకుండా చూడడం, దోమల పెరుగుదలకు మార్గం లేకుండా నీటి నిల్వలను తొలగించాలని చెప్పారు. క్యాంపస్‌ పరిశుభ్రత, చెత్త నిర్వహణ, రికార్డులను లాకర్లలో భద్రపరచడం, డిజిటలైజేషన్‌ ప్రోత్సహించడం వంటి అంశాలను కూడా సూచించారు. సెలవుల్లో కూడా హెడ్‌మాస్టర్లు స్కూల్‌ను పర్యవేక్షిస్తూ వాచ్‌మన్‌న్‌ లాగ్‌బుక్‌ నిర్వహించాలని తెలిపారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీతో సమన్వయం కొనసాగిస్తూ, బడి మూసివేత విషయాన్ని స్థానికులకు తెలియజేయాలని సూచించారు.

అత్యవసర సమయంలో ఫోన్‌ నెంబర్లు

అత్యవసర పరిస్థితిలో స్పందించేలా పోలీసు, ఫైర్‌, విద్యుత్‌ శాఖల కాంటాక్ట్‌ నెంబర్లను స్కూల్‌ ఆవరణలో ప్రదర్శించాల్సి ఉంటుంది. డిజిటల్‌ సెక్యూరిటీ కోసం పరికరాలను ఆఫ్‌ చేసి కవర్‌ చేయడం, ముఖ్యమైన డేటాను బ్యాకప్‌ చేయడం, సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన వంటశాలలు శుభ్రపరచడం, ధాన్యాలను సురక్షితంగా నిల్వ చేయడం, ఎల్పీజీ సిలిండర్లు ఆఫ్‌ చేసి సెక్యూర్‌ చేయడం కూడా తప్పనిసరి చేశారు. వర్షాలు, గాలివానల వంటి విపత్తులకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సెలవుల్లో విధులు నిర్వహించే సిబ్బందిని నియమించి, వారి కాంటాక్ట్‌ వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పారు.

డీఈఓలు, హెడ్‌మాస్టర్లకు సమగ్రశిక్ష కీలక ఆదేశాలు

ఈ నెల 24నుంచి పాఠశాలలకు

సెలవులు

పరికరాలు, వస్తువుల రక్షణపై సూచనలు

విద్యుత్‌, అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు

సీసీటీవీ, డిజిటల్‌ భద్రతపై కఠిన

సూచనలు

తెరుచుకునే లోపే

జూన్‌లో పాఠశాలలు తిరిగి తెరవడానికి ముందు పరిశుభ్రత, తాగునీరు, శానిటేషన్‌, భద్రతా అంశాలపై పూర్తి తనిఖీ చేసి, రెడీనెస్‌ రిపోర్ట్‌ను సమర్పించాలని ఆదేశించారు. ఏదైనా నష్టం, దొంగతనం, అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే నివేదించాలని, ఫిర్యాదుల రిపోర్ట్‌ సెలవుల ముందు, తర్వాత ఇవ్వాలని పేర్కొన్నారు. పాఠశాల ఆస్తుల సంరక్షణలో నిర్లక్ష్యం కనబరిస్తే హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు బాధ్యులని స్పష్టం చేస్తూ, డీఈఓలు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement