● సాగునీటికి రైతుల అవస్థలు
● పునరుద్ధరణ పనులు చేపడితే వెయ్యి ఎకరాలకు సాగునీరు
● పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలో పాంనూర్ గ్రామంలోని బంజరుకాల్వకు దశాబ్దాలుగా మరమ్మతులు చేయకపోవడంతో సాగునీటి కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. పాంనూర్ గ్రామ శివారులోని బంజరుకాల్వ పూడుకుపోయింది. కాల్వ శిథిలం కావడంతో పాటు విపరీతంగా పిచ్చిమొక్కలు పెరిగాయి. దాంతో కాల్వ పూర్తిగా పూడుకుపోయి బంజరుకాల్వ ద్వారా నీరు ముందుకు వెళ్లడం లేదు. ఘన్‌పూర్ రిజర్వాయర్ పూర్తయి అక్కడి నుంచి దాదాపు 17ఏళ్లుగా సాగునీరు వస్తున్నా బంజరుకాల్వ శిథిలమై పూడుకుపోవడంతో రైతులకు సాగునీరు రావడం లేదు. బంజరుకాల్వను మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకువస్తే మొత్తంగా వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో 550 ఎకరాలు పాంనూర్, 250 ఎకరాలు చిల్పూరు మండలం నష్కల్, 250 ఎకరాలు జఫర్‌గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామాలకు సాగునీరు అందుతోంది.
కాల్వకు పలుచోట్ల గండ్లు
దాదాపు 80 ఏళ్ల క్రితం గ్రామంలో నిర్మాణం చేపట్టిన బంజరుకాల్వకు పలు చోట్ల గండ్లు పడడం, తుమ్మచెట్లు, పిచ్చిచెట్లు పెరిగి కాల్వ పూర్తిగా పూడ్చుకుపోవడంతో రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విపరీతంగా పిచ్చిమొక్కలు పెరగడంతో ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి తూము ద్వారా వచ్చే నీళ్లు వాగుపాలు అవుతున్నాయి. కాల్వ పునరుద్ధరణ పనులు చేపట్టాలని పలుమార్లు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు.
80 ఏళ్ల క్రితం బంజరుకాల్వ నిర్మాణం
గ్రామానికి చెందిన బాబుదొర అనే సాంకేతిక నిపుణుడు దాదాపు 80 ఏళ్ల క్రితం వరద ప్రవాహం ద్వారా వచ్చే నీళ్లను ఎలాగైనా ఆపి గ్రామ రైతాంగానికి రెండు పంటలకు సాగునీరు అందించే సంకల్పంతో ఆరోజుల్లో బంజరుకాల్వ, పర్రె కాల్వల నిర్మాణం చేశారని రైతులు చెపుతున్నారు. గతంలో పాంనూర్ గ్రామ రైతాంగానికి సాగునీరు సమృద్ధిగా ఉండటంతో పాటు ఇక్కడ నుంచి దిగువన ఉన్న జఫర్‌గడ్ మండలం ఉప్పుగల్లుకు సాగునీరు వెళ్లేవి. కాలక్రమంలో బంజరుకాల్వ, పర్రెకాల్వలకు పలు చోట్ల గండిపడటం, కాల్వలలో పిచ్చిచెట్లు ఏపుగా పెరిగి నీళ్లు దిగువ ప్రాంతానికి అందడం లేదు. తలాపున గోదావరిలా ఘన్‌పూర్ రిజర్వాయర్‌లో సమృద్ధిగా నీరు ఉన్నా బంజరుకాల్వ, పర్రెకాల్వకు గండ్లు ఏర్పడి, పిచ్చి మొక్కలు పెరిగి నీరందక పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది.
గ్రామసభలో ఎమ్మెల్యే ఎదుట ప్రస్తావించిన గ్రామస్తులు
ఇటీవల గ్రామంలో జరిగిన ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరుకాగా పలువురు బంజరుకాల్వ సమస్యపై సభ దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి సమస్య పెండింగ్‌లో ఉందని, సమస్యను పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.
శాశ్వత మరమ్మతు చేయాలి
బంజరుకాల్వకు శాశ్వత మరమ్మతు చేపట్టాలి. ఈవిషయమై పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటిౖకైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాల్వకు శాశ్వత మరమ్మతు చేస్తే వందలాది ఎకరాలకు ప్రయోజనంగా ఉంటుంది. –ఒగ్గు రాజు, రైతు
ఏడాదిలోపు సమస్య పరిష్కరిస్తా
బంజరుకాల్వ సమస్య నా దృష్టికి వచ్చింది. పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వారు సమస్యను పట్టించుకోలేదు. సమస్యపై పూర్తిఅవగాహన ఉంది. బంజరుకాల్వ సమస్యను ఏడాదిలోపు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తా.
–కడియం శ్రీహరి, ఎమ్మెల్యే


