జనగామ: ప్రజాపాలన–ప్రగతి పాలనలో భాగంగా సిద్దిపేట ప్రధాన రహదారి చంపక్‌హిల్స్ సమీపంలో ఎంసీహెచ్ ఆవరణలో గుంతలమయంగా మారిన రోడ్డుకు మంగళవారం మరమ్మతు చేపట్టారు. ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భరత్, రతీశ్, చెన్నకేశవులుతో కలిసి డీసీపీ రాజ మహేంద్ర నాయక్ రోడ్డును సందర్శించారు. రోడ్డు గుంతలను పూడ్చివేసి వాహన దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు.
రోడ్డు భద్రతపై అవగాహన
జనగామ: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం రవాణా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం వద్ద వాహనదారులతో రోడ్డు భద్రత అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పట్టణంలోని ప్రమాదాలకు ఆస్కారంగా ఉన్న బ్లాక్ స్పాట్స్ గుర్తించి నివారణకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, డీటీఓ జీవీఎస్ గౌడ్, సీఐ సత్య నారాయణరెడ్డి, ఎస్సైలు చెన్నకేశవులు, భరత్ ఉన్నారు.
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పాలకుర్తి టౌన్: తెలంగాణ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యాసంవత్సరానికి ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాలకుర్తి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.స్వరూప మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్ సిలబస్‌తో పాటు ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో విద్యనభ్యసించే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఆర్‌ఈసీఈటీ) ఆధికారిక వైబ్‌సెట్ ద్వారా ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. ప్రవేశ పరీక్ష మే 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ పరీక్ష ధ్వారా ఎంపికై న విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, నాణ్యమైన విద్య అందించబడుతుందన్నారు. వివరాలకు సమీప గురుకుల జూనియర్ కాలేజీలను సంప్రదించాలన్నారు.
నేడు వరంగల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన
హన్మకొండ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు నేడు (బుధవారం) వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..మధ్యాహ్నం 2గంటలకు వరంగల్ ఓ సిటీలోని వీధి వ్యాపారులను సన్మానించి వారికి టీ స్టాళ్లు పంపిణీ చేయనున్నారు. 3 గంటలకు గ్రాండ్ గాయత్రి హోటల్‌లో మీడియా సమావేశంలో, సాయంత్రం 4 గంటలకు 44వ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమంలో రాంచందర్ రావు పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు వేయిస్తంభాల దేవాలయం నుంచి నారీశక్తి వందన్ అథినియం కార్యక్రమంలో భాగంగా మహిళా మోర్చా బైక్ ర్యాలీని ప్రారంభించి, ర్యాలీలో పాల్గొంటారు. సాయంత్రం 7:30 గంటలకు హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ద్విచక్ర వాహన ర్యాలీ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.
గాజుల లారీలో మంటలు
జనగామ: మండలంలోని యశ్వంతాపూర్ వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి సత్యసాయి కన్వెన్షన్ ఫంక్షన్ హల్ ఎదురుగా ఓ గాజుల లారీలో మంటలు వ్యాప్తి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వరంగల్ నుంచి యాదాద్రి జిల్లా ఆలే రు హెడ్ క్వార్టర్‌కు గాజుల లోడుతో వెళ్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సంజయ్ వెంటనే ప్రమాదాన్ని గమనించి 100కు డయల్ చేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఫైర్ డిపార్టుమెంటుకు సమాచారం అందించగా, వారు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో లారీలోని లోడ్ కాలిపోగా, డ్రైవర్ సంజయ్, కో డ్రైవర్ చంబీమాథ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.


