పోరాటగడ్డపై ‘రాజ్యాంగం’ అమలుకావట్లే | - | Sakshi
Sakshi News home page

పోరాటగడ్డపై ‘రాజ్యాంగం’ అమలుకావట్లే

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

జనగామ: జనగామలో భారత రాజ్యాంగం అమలుకావడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తాలో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గద్దల కిషోర్‌ అధ్యక్షతన ష్యెడూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ 135వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌, డీసీపీ రాజమహేంద్రనాయక్‌, ఏఎస్పీ పండేరీ చేతన్‌ నితిన్‌, డాక్టర్లు సుగుణాకర్‌రాజు, రాజమౌళి, మాచర్ల భిక్షపతి, కృష్ణ, రంజిత్‌, తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనగామలో కలెక్టర్‌, పోలీసుల విషయానికి వస్తే రాజ్యాంగం అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోరాట యోధులు పుట్టిన గడ్డలో రాజ్యాంగం అమలుకాకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక దళిత మహిళ కలెక్టర్‌ కార్యాలయం పక్కన టీ స్టాల్‌ ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుత కలెక్టర్‌ దానిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి సందర్భాల్లో దళిత సంఘాలు స్పందించకపోవడం విచారకరమన్నారు. జనగామలో వైన్స్‌ సిండికేట్‌ ప్రైవేట్‌ సైన్యంలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని బెల్ట్‌ షాపులను మూసివేయాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మాధవిలత, మునిసిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, షెడ్యూల్డ్‌ కులాల సంఘాల రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు బొట్ల శేఖర్‌, గద్దల నర్సింగరావు, మేడ శ్రీనివాస్‌, పార్నంది వెంకటస్వామి, అడ్వకేట్‌ సాదిక్‌ అలీ, అనిత, రాములు, మల్లిగారి రాజు, మధు, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement