న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● ప్రజావాణిలో 258 అర్జీలు
● దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇల్లును తండ్రి పేరున మార్చాలని, నడవలేని స్థితిలో ఉన్న మూడుచక్రాల బండి ఇప్పించాలని, భూ సమస్యలు పరిష్కరించాలని..ఇలా పలు సమస్యలతో ప్రజలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వారి వినతులు స్వీకరించి.. తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్‌లో మొత్తం 258 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజావాణి దరఖాస్తు పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, ఆర్డీఓ గోపీరాం, వెంకన్న, డీడబ్ల్యూఓ కోదండ రాములు, డీఏఓ అంబికా సోనీ, వివిధ శాఖల సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పక్షవాతం బాధితుడికి తక్షణమే సాయం
లింగాలఘణపురం మండలం జీడికల్ గ్రామానికి చెందిన మాధవి తన భర్తకు హార్ట్ స్ట్రోక్ కారణంగా పక్షవాతం రాగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని మెరుగైన వైద్యం అందించి తమను ఆదుకోవాలని విన్నవించారు. దీంతో తక్షణమే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి మందులు ఇప్పించారు. దీంతో బాధితులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
దరఖాస్తులు కొన్ని ఇలా
● సహారా ఇండియా సంస్థపై ఎంక్వయిరీ చేసి ప్రజలు కట్టిన డబ్బులు ఇప్పించాలని ఓబుల్ కేశవాపూర్‌కు చెందిన బడికే కిష్టయ్య కలెక్టర్‌ను కోరారు.
● అంబేడ్కర్ భవన నిర్మాణానికి పట్టణంలో ఎకరం స్థలం కేటాయించాలని సాధిక్ ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది సాధిక్ అలీ విన్నవించారు.
● బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన నర్సింగ శైలజ, తమ ఇల్లు పూర్తిగా కూలిపోయిందని, ప్రస్తుతం అద్దెకు ఉంటున్నారని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.
● తరిగొప్పుల మండలం బొత్తలపర్రె గ్రామానికి చెందిన భూక్య లక్ష్మీ, తనకు బొంతగట్టు నాగారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న 20 గుంటల భూమికి పట్టా పాస్‌బుక్కు ఇవ్వాలని కోరారు.
● దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన ఆకల యాదగిరి, తనకు 2022లో జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు పనిచేయడం లేవని, రేషన్ బియ్యం ఇప్పించాలని విన్నవించారు.
● జనగామ మండలం పెంబర్తి గ్రామానికి చెందిన చిన్నం మల్లయ్య (65)కు వృద్ధాప్య పింఛన్ అందించి ఆదుకోవాలని వినతిపత్రం అందించారు.


