● న్యాయం చేయాలని డిమాండ్
బచ్చన్నపేట : భర్త తనను వద్దంటున్నాడని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ భార్య.. భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం జాల గ్రామానికి చెందిన కాకల్ల వెంకటమ్మ, కనకయ్య దంపతుల కుమార్తె సౌమ్యకు మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన కన్నె మల్లమ్మ, యాదయ్య దంపతుల రెండో కుమారుడు శివతో 2021లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 2.50 లక్షల నగదు, ఆరు తులాల బంగారం కట్నకానుకలుగా అందజేశారు. వివాహం జరిగిన మొదటి ఏడాది వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే నాలుగు సంవత్సరాలుగా భర్త శివ తనను ఇంటికి తీసుకువెళ్లకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సౌమ్య ఆవేదన వ్యక్తం చేసింది. భర్త, బావ వైఖరితో విసిగిపోయిన బాధితురాలు, చివరకు న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. అధికారులు స్పందించి తనను తన భర్తతో కలిపి జీవించేలా న్యాయం చేయాలని కోరింది. కాగా, సౌమ్యకు జాల, నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు మద్దతు తెలిపారు.
రామనరసింహారావుపై సస్పెన్షన్ వేటు
కాజీపేట అర్బన్ : వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్– 1 సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తూ ఈనెల 2వ తేదీన ఏసీబీ విచారణ ఎదుర్కొన్న రామనరసింహారావును రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శని,ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సస్పెన్షన్ ఉత్తర్వుల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాయింట్–2 ఆనంద్‌ను డీఐజీ సుభాషిణి ఈనెల 4వ తేదీన ఏసీబీ అధికారుల నివేదిక ఆధారంగా సస్పెండ్ చేయగా, వారం రోజుల తర్వాత ఐజీ జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రామనరసింహారావును సస్పెండ్ చేశారు.


