జిల్లాలో ఆసరా లబ్ధిదారులు
జనగామ రూరల్: ఆసరా కొత్త పింఛన్ల కోసం అర్హులైన దరఖాస్తుదారులు ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు వేలల్లో ఉన్నారు. ఆసరా పింఛన్ల కోసం నిత్యం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలో రాగానే ఆసరా పింఛన్లు పొందేందుకు అర్హత వయస్సు సడలించింది. 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. మీసేవా సెంటర్లలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. ప్రభుత్వ సూచనల మేరకు గ్రామాల్లో దరఖాస్తుదారులు వేలల్లో పెరిగారు. మొత్తం 15,974 మంది పింఛన్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రతీ రోజు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం 99 రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను చదివి వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల కోసం ఆయా గ్రామాల్లోని అర్హులైన వారు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్కో గ్రామానికి కనీసం యాభై నుంచి వంద వరకు పింఛన్ల దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పెద్ద గ్రామ పంచాయతీల్లో ఏకంగా 100పైగా దరఖాస్తులు చేసుకున్నారని చెబుతున్నారు. అయితే కొత్త పింఛన్లు మంజూరు కాక చాలా సంవత్సరాలు గడుస్తోంది. చివరిసారిగా 2022 ఆగస్టు 31న పింఛన్లు మంజూరయ్యాయి. దాదాపు నాలుగు సంవత్సరాలుగా పింఛన్ల దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. దీంతో చాలా మంది అర్హులైన వారికి పింఛన్లు రావడం లేదు. దీనికితోడు 57 సంవత్సరాలు నిండిన వారు కూడా కొత్తగా ఈ పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు సంబంధించిన విధివిధానాలపై స్పష్టత రాకపోవడంతో ఆసరా పెన్షన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నరకయాతన పడుతూ నిత్యం కార్యాలయాల చుట్టు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అధికార వర్గాలు కూడా దీనిపై కచ్చితమైన సమాచారం చెప్పకపోడంతో ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ కోసం చేసిన దరఖాస్తులు గ్రామ కార్యదర్శికి ఇవ్వాలా? ఎంపీడీఓ కార్యాలయాల్లో సమర్పించాలా? అనేది తెలియకపోవడంతో మద్యలోనే ఆగిపోతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు వేచిచూడాల్సి వస్తోంది.
గతంలో వచ్చిన దరఖాస్తులు 15వేలు
ప్రగతి ప్రణాళికలో మరిన్ని దరఖాస్తులు
ఒక్కో గ్రామంలో కనీసం 50కిపైగా అప్లికేషన్లు
నాలుగేళ్లుగా నిలిచిపోయిన మంజూరు
ఏళ్ల తరబడిగా నిరీక్షణ
వృద్ధులు : 30,031
వితంతువులు : 25,414
దివ్యాంగులు : 10,225
బీడీ కార్మికులు : 2,052
గీత కార్మికులు : 2,792
హెచ్‌ఐవీ : 730
ఫైలేరియా : 706
ఒంటరి మహిళ : 1,475
ఇతరులు : 1,568
మొత్తం పింఛన్ దారులు : 74,993


