ఎంసీహెచ్‌లో భద్రతపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

ఎంసీహెచ్‌లో భద్రతపై ఫోకస్‌

Apr 10 2026 10:09 AM | Updated on Apr 10 2026 10:09 AM

కొత్త నిబంధనలు..

నలుగురికి మెమోలు

పనిచేయని సీసీ కెమెరాలు

జనగామ: జనగామ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌)లో శిశువుల భద్రత ఆందోళన కలిగిస్తుండగా, మరోసారి పునరావృతం కాకుండా నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ఓపీ, అడ్మిట్‌ పేషెంట్లతో పాటు పదుల సంఖ్యలో గర్భిణులు, బాలింతలు, శిశువులు సేవలు పొందే ఈ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న ప్రశ్నకు ఈ సంఘటన సాక్ష్యంగా నిలిచింది.

ఎస్‌ఎన్‌సీయూ వార్డులో కఠిన నిఘా

ఎంసీహెచ్‌లోని ప్రత్యేక శిశు సంరక్షణ విభాగం ఎస్‌ఎన్‌సీయూలో నలుగురు స్టాఫ్‌ నర్సులు, ఒక డ్యూటీ డాక్టర్‌, ఒక హెడ్‌ నర్స్‌, మరో స్టాఫ్‌ నర్స్‌తో పాటు సెక్యూరిటీ గార్డు పర్యవేక్షణ ఉంటుంది. రోజుకు మూడు షిఫ్టుల్లో వీరు పర్యవేక్షణ చేస్తారు. అయితే ఈ వ్యవస్థలన్నింటి కళ్లుగప్పి ఈ నెల 8వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో ఓ మహిళ 8 రో జుల శిశువును ఎవరికీ అనుమానం కలగకుండా తీసుకెళ్లడం ఆశ్చర్యానికి గురి చేసింది. బిడ్డ కోసం ఎస్‌ఎన్‌సీయూకు చేరుకున్న తల్లి(బాలింత) కీర్తన బాక్స్‌లో తన బాబు కనిపించకుండా ఉండడాన్ని గమనించి వెంటనే అలర్ట్‌ సిబ్బందిని చేసింది. అప్పటివరకూ అక్కడ ఉన్న వైద్య సిబ్బంది, నర్సులు, సెక్యూరిటీ గార్డు ఎవరికీ శిశువు లేడన్న విషయం తెలియకపోవడం అత్యంత నిర్లక్ష్యంగా భావిస్తున్నారు.

సెక్యూరిటీ సిబ్బంది కొరత..

రాత్రిపూట కేవలం ముగ్గురు సెక్యూరిటీ గార్డులు మాత్రమే పనిచేస్తున్నట్లు డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శిశువుల వార్డుల్లో కనీసం ఆరుగురు సిబ్బంది అవసరమని, అందులో ఒకరు మహిళా సెక్యూరిటీ తప్పనిసరి అని సూచించారు.

సెక్యూరిటీ మరింత బలోపేతం

శిశువు అపహరణ ప్రయత్నం తర్వాత అలర్ట్‌

ముగ్గురు సిస్టర్లు, సెక్యూరిటీ గార్డులకు మెమోలు

సూపరింటెండెంట్‌, డీసీపీ విచారణ

ఎంసీహెచ్‌లో ఇక ముందు నుంచి భద్రతను బలోపేతం చేస్తూ కొత్త నియమాలు అమలు చేయనున్నారు. శిశువు జన్మించిన వెంటనే వేసే ట్యాగ్‌తో పాటు తల్లికి కూడా ప్రత్యేక ట్యాగ్‌ వేయనున్నారు. ఈ రెండు ట్యాగులు ఒక్కటిగా ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతనే శిశువును తల్లిదండ్రులకు లేదా బంధువులకు చూపే అవకాశం ఇస్తారు. అవుట్‌సైడ్‌ బంధువులు ఆసుపత్రికి వచ్చి బాలింతలను చూడడం గురించి కఠిన నియమాలు అమలు చేయనున్నారు.

శిశువు అపహరణ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజలింగం, ఏఎస్పీ పండేరి చేతన్‌ నితిన్‌, సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి డీసీపీ రాజమహేహేంద్ర నాయక్‌ వేర్వేరుగా విచారణలు చేపట్టారు. అందులో ముగ్గురు సిస్టర్లు, ఒక సెక్యూరిటీ గార్డుపై నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టత రావడంతో వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. పోలీసులు శిశువును ఎత్తుకెళ్లిన మహిళపై లోతైన విచారణ చేస్తున్నారు. ఆమె ఎందుకు ఇలాంటి చర్యకు పాల్పడింది, ముందుగా ప్లాన్‌ చేసి వచ్చిందా, ఎవరి సహకారం ఉంది అన్న దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఎంసీహెచ్‌లో సీసీ కెమెరాల పనితీరు పూర్తిస్థాయిలో పని చేయడం లేదు. ఆస్పత్రిలోని ప్రధాన వార్డులను కవర్‌ చేస్తూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేయక పోవడంతో సాంకేతిక లోపాలు, కోతులు వైర్లను తెంపేయడం వంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయి. కానీ దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావడంలో అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement