జనగామ రూరల్: జెడ్పీ సీఈఓగా బి.రంగారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. జనగామ డిప్యూటీ సీఈఓగా పనిచేసిన డి.సరిత ఫైనాన్స్ అడ్వైజరీ ఎస్‌ఆర్‌డీఎస్ కమిషనర్ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేయగా రంగారావు బాధ్యతలు చేపట్టారు.
కేయూ క్యాంపస్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్టు (టీజీసీపీజీఈటీ) కన్వీనర్ కె.రాజేందర్ గురువారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. టెస్ట్ నిర్వహణపై కొద్దిసేపు చర్చించారు. సీపీజీఈటీని పకడ్బందీగా నిర్వహించాలని బాలకిష్టారెడ్డి పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కేయూలో సీపీజీఈటీ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించాక త్వరలోనే పీజీ కోర్సుల్లో ప్రవేశపరీక్షకు దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాజేందర్ గురువారం తెలిపారు.
నేడు మెగా రక్తదాన శిబిరం
జనగామ రూరల్: కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ నెల 10న(శుక్రవారం) మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు అందించడం జరుగుతుందన్నారు. కావున జిల్లా అధికారులు, అన్ని శాఖల ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు.
బెట్టింగ్ యాప్‌ల
జోలికి వెళ్లొద్దు
పాలకుర్తిటౌన్: ఆన్‌లైన్, గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లవద్దని సీఐ జానకీరాంరెడ్డి సూచించారు. బెట్టింగ్ యాప్‌లతో నష్టాలపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మండలంలోని దర్దెపల్లి గ్రామంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ కొన్ని ముఠాలు యువతను బెట్టింగ్ ఊబిలోకి దించుతున్నాయని, ఇరువర్గాల్లో ఎవరు ఓడినా, గెలిచినా ముఠాలకు కమీషన్ వచ్చిపడుతుందన్నారు. ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సై దూలం పవన్‌కుమార్, పోలీసులు, యువత పాల్గొన్నారు.
నయీంనగర్: ప్రజల అభీష్టం మేరకు హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో విలీనం చేసి ఈ మహా నగరాన్ని రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దాలని పౌర సంఘాలు, మేధావులు, నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో పౌర సంఘాలు, మేధావులు, నాయకులు నిర్వహించిన సదస్సుకు విశ్రాంత ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే రాజధానితోపాటు ఉమ్మడి జిల్లాల కేంద్రాలు అభివృద్ధి చోదక కేంద్రాలుగా ఎదుగుతాయని ఆశించిన రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. హైదరాబాద్ మాదిరి అన్ని జిల్లాలతో కలిపి మూడు కోట్ల అరవై లక్షల ప్రజల అభివృద్ధి కావాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్ నగరాన్ని ముక్కలు చేసి, పార్క్‌ల భూములు కబ్జా చేసి, వరంగల్ జైలు భూమిని తాకట్టు పెట్టి అభివృద్ధిని విచ్ఛిన్నం చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండు జిల్లాలను కలపడంలో, వరంగల్ మహానగర పునర్నిర్మాణం చేయడంలో తాత్సారం చేస్తోందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ చైర్మన్ కె.సుధాకర్, మాజీ మేయర్ టి.రాజేశ్వర్ రావు, సీపీఎం నాయకుడు చుక్కయ్య, వెంకటరాజం, దాసరి కృష్ణారెడ్డి, ప్రొ.వి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


