
బంకులో అంకెల గారడీ
జనగామ: జనగామ పట్టణం సిద్దిపేట రోడ్డు జిల్లా ఆస్పత్రి ఏరియా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భారత్ పెట్రోలియంలో పెట్రోలు తక్కువ వచ్చిన ఘటనపై కస్టమర్లు గురువారం ఆందోళనకు దిగారు. పట్టణానికి చెందిన చంద్రశేఖర్, అభిషేక్, ఉదయ్ తదితరులు 2.25 లీటర్ థమ్సప్ బాటిల్‌లో పెట్రోలు పోయించుకున్నారు. క్వాంటిటీ 2.33 లీటర్లంటూ బిల్లు జనరేట్ అయ్యింది. దీంతో తక్కువ క్వాంటిటీ పెట్రోల్‌కు ఎక్కువ బిల్లు వచ్చిందని బాధితులు నిర్వాహకులను నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు వెంటనే తూనికలు, కొలతల జిల్లా అధికారి శ్రీనివాస్, జిల్లా పౌరసఫరాల శాఖ అధికారి సరస్వతీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు పెట్రోల్ బంకు వద్దకు వచ్చారు. ఫిర్యాదు చేసిన కస్టమర్లతో పాటు ప్రజల సమక్షంలో మున్సిపల్ రోడ్డు వైపు ఉన్న బంకులోని ఓ ఫ్యూయల్ డిస్పెన్సర్‌ను తనిఖీ చేశారు. అధికారుల సాక్షిగా ఆ పంపులో నంబర్స్ జంప్ అవుతున్న సంగతిని గమనించి.. పెట్రోల్ సైతం తక్కువగా రావడాన్ని గుర్తించారు. అలాగే బంకులోని ప్రతీ డిస్పెన్సర్‌కు ఉన్న అధికారిక సీల్, ఐదు లీటర్ల క్యాన్‌లో పెట్రోలు తీసి తనిఖీ చేశారు. వారం రోజుల నుంచి పంపు జంప్ అవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడున్న ప్రజలు మండిపడ్డారు. నిత్యం వందలాది మంది తమ వాహనాల్లో పెట్రోలు పోయించుకుని నష్టపోయారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ బంక్‌ను సీజ్ చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం తూనికలు, కొలతల అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి భారత్ పెట్రోలియంలోని ఓ ఫ్యూయల్ డిస్పెన్సర్‌లో నంబర్స్ జంప్ అవుతున్న విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. వారం నుంచి జంప్ అవుతున్నట్లుగా కస్టమర్లు చెప్పారని, పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేసినట్లు చెప్పారు. ప్రస్తుతం బంకులోని ఒక ఫ్యూయల్ డిస్పెన్సర్‌ను సీజ్ చేశామని, కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు.
జిల్లాలో బంకుల నిర్వహణపై ఆందోళన
జిల్లాలోని పెట్రోల్ బంకుల నిర్వహణపై కస్టమర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు బంకుల్లో పెట్రోలు తక్కువ రావడం, నీళ్లు రావడం, జంప్ సిస్టం తదితర వాటిపై ఫిర్యాదులు రాగా.. తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. సంబంధిత అధికారులు పెట్రోల్ బంకులను తనిఖీ చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
పెట్రోల్ బంకులో నంబర్ల జంపింగ్
తక్కువ వచ్చిందంటూ అధికారులకు వినియోగదారుల ఫిర్యాదు
ఒక ఫ్యూయల్ డిస్పెన్సర్ సీజ్..
కలెక్టర్‌కు నివేదిక

బంకులో అంకెల గారడీ