
కల నెరవేరింది
జనగామ: రెండు దశాబ్దాల పోరాటం ఫలించింది. మొక్కవోని దీక్ష న్యాయం వైపు దారి చూపించింది. ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ప్రభుత్వంతో సంప్రదింపులు కొలిక్కి రాకపోవడంతో.. కోర్టు మెట్లు ఎక్కిన టీచర్లకు తీపి కబురు అందిస్తూ తీర్పు వెలవరించింది. పాత పెన్షన్ విధానానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, అపాయింట్‌మెంట్ ఆర్డర్లలో జాప్యం జరగడంతో సీపీఎస్ పరిధిలోకి వచ్చారు. ప్రభుత్వాలతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో కోర్టు ద్వారా న్యాయాన్ని పొందారు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు. ఇందుకు సంబంధించి సాక్షి ప్రత్యేక కథనం.
పోరాటం సాగిందిలా...
2003 నవంబర్ మాసంలో డీఎస్సీ–2003 నోటిఫికేషన్ జారీ చేశారు. ఉపాధ్యాయుల సెలక్షన్ ప్రక్రియ జూన్ 2004లో పూర్తి చేశారు. ఈ సమయంలో పాత పెన్షన్ (ఓపీఎస్) విధానం అమల్లో ఉంది. కానీ టీచర్లకు మాత్రం అపాయింట్‌మెంట్ ఆర్డర్లు 2005 నవంబర్‌లో ఇచ్చారు. నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఓపీఎస్ అమలులో ఉన్న సమయంలోనే అర్హత సాధించినప్పటికీ, ఆర్డర్‌లో జాప్యం కావడంతో సీపీఎస్ పరిధిలోకి వెళ్లారు. దీనిపై అప్పట్లోనే నిరసనలు తెలిపారు. ఓపీఎస్ కిందకు తీసుకురావాలని నాటి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు. ఫలితం లేకపోవడంతో ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలం తర్వాత డీఎస్సీ–2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ పథకానికి అర్హులేనని ప్రకటిస్తూ తీర్పు వెలువడింది. ఒక్క టీచర్లే కాకుండా 2003లో కానిస్టేబుల్, గ్రూప్–1, హెల్త్ డిపార్టుమెంట్ల ఉద్యోగులకు సైతం పాత పింఛన్ వర్తించనుంది.
కోర్టు తీర్పు ఇలా..
డీఎస్సీ 2003 ద్వారా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) వర్తింపజేయాలని తెలంగాణ హైకోర్టు గత నెల 29వ తేదీన తీర్పు ఇచ్చింది. డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు సీపీఎస్ కాకుండా పాత పెన్షన్ విధానం అమలు చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఓపీఎస్ అమలు చేస్తే పెన్షన్, డీఏ, ఫ్యామిలీ పెన్షన్ తదితర సౌకర్యాలు అమలులోకి రానున్నాయి.
రెండు దశాబ్దాల నిరీక్షణకు తెర
ఓపీఎస్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు
సంతోషంలో 2003 డీఎస్సీ
ఉపాధ్యాయులు
ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని విన్నపం
జిల్లాలో 73 మంది
జిల్లాలో 2003 నాటి డీఎస్సీ టీచర్లు 73 మంది ఉన్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు బయోసైన్స్–1, ఇంగ్లిష్–15, హిందీ–2, గణితం–3, పీడీ–1, ఫిజికల్ సైన్స్–15, సాంఘిక–5, తెలుగు–6, ఎస్జీటీ–25 మంది ఉన్నారు. హైకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.