
ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి
హన్మకొండ కల్చరల్ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్‌కు శుక్రవారం బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో నేషనల్ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఎంతో సంతోషంగా ఉంది..
నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్ సంగీతంపాటు మంగ్లీ, రామ్ మిర్యాల వాయిస్‌లు తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటూ పాటరూపంలో రాశా. – కాసర్ల శ్యామ్, పాటల రచయిత
జిల్లావాసి కాసర్ల శ్యామ్‌కు
నేషనల్ అవార్డు
ఉత్తమ లిరిక్‌రైటర్‌గా గుర్తింపు
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు