
స్వాతంత్య్ర దినోత్సవానికి నెల్లుట్ల పంచాయతీ కార్యదర్శి
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి రొండ్ల శ్రీనివాసురెడ్డికి ఈ నెల 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలంటూ శుక్రవారం ఆహ్వానం అందింది. భూగర్భ జలాల అభివృద్ధిలో 2023లో అప్పటి సర్పంచ్ చిట్ల స్వరూపరాణిభూపాల్‌రెడ్డి జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. మళ్లీ అదే గ్రామపంచాయతీకి చెందిన పంచాయతీ కార్యదర్శికి ఆహ్వానం రావడం విశేషం. రాష్ట్రం నుంచి ఆరుగురికి ఆహ్వానం అందగా జిల్లా నుంచి లింగాలఘణపురం మండలం నెల్లుట్ల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసురెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు 14న శ్రీనివాసురెడ్డి ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు.