
కష్టాలు
తీరనున్న కట్టెల పొయ్యి
సర్కారు బడుల్లో గ్యాస్ సిలిండర్లు అందించేందుకు నిర్ణయం
మండలాల వారీగా పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య
మండలం పాఠశాలలు విద్యార్థులు
తరిగొప్పుల 21 695
చిల్పూరు 35 1,596
జఫర్‌గఢ్ 32 1,629
స్టేషన్‌ఘన్‌పూర్ 31 2,138
రఘునాథపల్లి 32 2,155
నర్మెట 29 1,228
బచ్చన్నపేట 41 2,410
జనగామ 55 3,440
లింగాలఘణపురం 31 1,618
దేవరుప్పుల 47 1,428
పాలకుర్తి 51 1,921
కొడకండ్ల 30 1,247
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు సిలిండర్లు లేని పాఠశాలల వివరాలను జిల్లా అధికారులు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. జిల్లాలోని 447 పాఠశాలల్లో 950 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పని చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాయి. గతంలో జిల్లాలో కొన్ని పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా.. అవి మూలనపడ్డాయి. నిర్వాహకులు మళ్లీ కట్టెల పొయ్యి మీదే ఆధార పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో పూర్తిస్థాయిలో ఎల్‌పీజీ కనెక్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆగస్టు 15వ తేదీలోగా అందించేందుకు..
జిల్లాలోని 12 మండలాల పరిధిలో 450 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉంది. 21,405 మంది విద్యార్థులకు ప్రతీరోజు భోజనం అందిస్తున్నారు. కేవలం 3 పాఠశాలల్లో మాత్రమే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్, స్టౌవ్‌లు అందుబాటులో ఉన్నాయి. మిగతా 447 పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రతిపాదనలు పంపించారు. నిర్వాహకులు కట్టెల పొయ్యి మీద వంట చేసే సమయంలో వెలువడే పొగతో అనేక అవస్థలకు గురవుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతోపాటు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్‌లు అందించేందుకు కనెక్షన్లు లేని పాఠశాలల వివరాలు సేకరించింది. ఆగస్టు 15వ తేదీలోగా గ్యాస్ సిలిండర్లు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సిలిండర్ల భారంపై సందిగ్ధం
మధ్యాహ్న భోజనం తయారీ కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ల భారం ప్రభుత్వమే భరిస్తుందా! లేక నిర్వాహకులపై వేస్తుందా! అనేది తెలియాల్సి ఉంది. గతంలో అందించిన గ్యాస్ కనెక్షన్లకు సిలిండర్ల భారాన్ని నిర్వాహకులే భరించారు. దీంతో చాలామంది భారం మోయలేక గ్యాస్ వినియోగించడమే మానేశారు. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరుకు తక్కువ ధరకే లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు సరిపడా వంటచెరుకు కోసం సుమారు రూ.1,500 వరకు చెల్లిస్తున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో వంట చెరుకు కోసం సుమారు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు అవుతుంది.
ఉచితంగా అందించాలి
మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్‌లు ఉచితంగా అందించాలి. ఇప్పటివరకు వంట చెరుకు కొనుగోలు చేసుకొని వంట చేస్తున్నాం. కట్టెల పొయ్యితో వచ్చే పొగతో ఇబ్బందులు పడుతున్నాం. అయినా కష్టపడి పిల్లల కోసం వంట వండి పెడుతున్నాం.
– ఆదిలక్ష్మి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు
కనీస వేతనాలు అమలు చేయాలి
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటివరకు అమలు చేయలేదు. రూ.26వేల కనీస వేతనం అందించాలనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించాలి.
– రాపర్తి రాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు
కనెక్షన్లు లేని పాఠశాలల వివరాల సేకరణ
జిల్లాలో 447 పాఠశాలలకు ప్రతిపాదనలు
మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట
పెరిగిన మెస్‌చార్జీలు
మధ్యాహ్న భోజనానికి సంబంధించిన మెస్‌చార్జీలను ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో పెంచారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.78 చెల్లిస్తుండగా 6 నుంచి 8వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.10.17 చొప్పున, 9, 10 తరగతి వారికి రూ.13.17 చొప్పున చెల్లిస్తున్నారు. రోజు విడిచి రోజు ప్రతీ విద్యార్థికి కోడిగుడ్డు అందిస్తున్నారు.

కష్టాలు

కష్టాలు

కష్టాలు