బచ్చన్నపేట : నీరు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయి.. సాగునీరు అందించి పంటలు కాపాడాలని డిమాండ్ చేస్తూ మండలంలోని వంగ సుదర్శన్‌రెడ్డినగర్ గ్రామం వద్ద జనగామ– సిద్దిపేట రహదారిపై కట్కూర్, వీఎస్‌ఆర్‌నగర్ గ్రామాల రైతులు శుక్రవా రం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగా గోదావరి జలాలు వస్తాయని ఆశించి పంటలు సాగు చేయగా.. నీరు రాక 45 శాతం వరకు వరి పొలాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పంటలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి ఎకరాకు రూ. 50వేల పరిహారంచెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్‌లు కోనేటి స్వామి, మూసిని సునీత, నాయకులు ఓరుగంటి శ్రీనివాస్, ఎల్లయ్య, రాజు, శ్రీశైలం, గొడుగు శ్రీనివాస్, బుల్లి అయిలయ్య, యాదయ్య, రవి, మహేష్, బాల్‌నర్సయ్య, సిద్దిరాజయ్య, సాయిలు, ప్రశాంత్ తదితరులుపాల్గొన్నారు.