జగిత్యాల: భూ వివాదాలకు ప్రధాన కారణం హద్దులు. గ్రామాల్లో హద్దులు సక్రమంగా లేక నిత్యం వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం భూమి మొత్తం సర్వే చేయించాలన్న ఉద్దేశంతో ఇటీవల లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ కల్పించింది. కానీ.. వారికి రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. శిక్షణ పొందిన అనంతరం ఖాళీగానే ఉంటున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అనంతరం ఈ లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియమకాలు చేపట్టింది. జిల్లాలో సుమారు 181 మంది సర్వేయర్లకు శిక్షణ కల్పించారు. వారికి సంబంధించిన విధి విధానాలపై స్పష్టత లేకపోవడం, బాధ్యతలు లేకపోవడంతో శిక్షణ పొందినప్పటి నుంచి ఖాళీగానే ఉంటున్నారు. తాజాగా వారికి పనులు అప్పగించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాల్లో సర్వే చేయించాలనే ఉద్దేశంతో వారికి విధివిధానాలు ఖరారు చేశారు. ఎకరాన వారికి రూ.50 చొప్పున చెల్లిస్తుంటారు. 500ఎకరాల వరకు అప్పగించనున్నారు. నెలలో 500 ఎకరాలు సర్వే చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో 20 మండలాలు
జిల్లాలో 20 మండలాలు.. 385 గ్రామాలున్నాయి. ఇప్పటికే మండలాల్లో సర్వేయర్ల కొరత ఉంది. నూతనంగా ఈ లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించినా.. సరైన అధికారాలు లేకపోవడం ఇబ్బందిగా మారింది. క్షేత్రస్థాయిలో సర్వేయర్లు రైతులు భూ కొలతల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడస్తున్నా కొలవకపోవడం, టైం రాకపోవడం, రైతులందరూ కార్యాలయాల చుట్టూ తిరిగి నానా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల లైసెన్స్‌డ్ సర్వేయర్లతో ఈ అవస్థలు తొలగించాలన్న ఉద్దేశంతో నియమించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. వీరికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియమక పత్రాలు అందించారు. మండలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా వారికి రెమ్యునరేషన్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో భూ సమస్యలు తీరే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఎకరాకు రూ.50
భూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు


