కోరుట్ల: తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని ఆ పార్టీ జాతీయ మహిళా మోర్చ అధ్యక్షురాలు వనితాశ్రీనివాసన్ అన్నారు. మోదీ 12ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన సమావేశానికి కాగజ్‌నగర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబుతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇప్పటికే 24 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 80 సీట్లు సాధించి సర్కార్ ఏర్పాటు చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నా.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లు కేంద్రంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి కేంద్రం పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ముందుగా బీజేపీ శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీతో నేతలకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనూప్‌రావు, రుద్ర శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, నవీణ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


