మైదానాల్లో క్రీడల జాతర | - | Sakshi
Sakshi News home page

మైదానాల్లో క్రీడల జాతర

Jun 19 2026 1:24 AM | Updated on Jun 19 2026 1:24 AM

కరీంనగర్‌స్పోర్ట్స్‌: రాష్ట్రంలోని పాఠశాల మైదానాలు త్వరలోనే సరికొత్త క్రీడా ఉత్సాహంతో ఉరకలెత్తనుండగా.. ఉమ్మడి జిల్లా సైతం సిద్ధమవుతోంది. విద్యార్థుల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభను వెలికితీసి వారిని రేపటి భవిష్యత్‌ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన క్రీడల క్యాలెండర్‌ను విడుదల చేసింది. క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, అంకితభావం తదితర అంశాలతో ఈ ఏడాది సరికొత్త క్రీడాపండుగకు అధికారులు రూపకల్పన చేయడం విశేషం. మైదానాల్లో పండుగ లాగా నాలుగంచెల విధానంలో జరగనున్న క్రీడల జాతర ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబర్‌ చివరి వారం వరకు ఉల్లాసభరితమైన వాతావరణంలో ఉత్కంఠభరితంగా సాగనున్నాయి.

ముందస్తు ప్రణాళికపై హర్షం

ఎస్జీఎఫ్‌ క్రీడా క్యాలెండర్‌ విడుదలపై పీఈటీలు, క్రీడాకారులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, వారిని మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయడానికి తగినంత సమయం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల పునఃప్రారంభం అయినప్పటి నుంచే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి వీలు కలుగుతుంది. ముందస్తు ప్రణాళిక గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ఒక గొప్ప వరం.

4 స్థాయిల్లో..

ఎస్జీఎఫ్‌ క్రీడా ప్రయాణం గ్రామీణస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీల వరకు ఒక క్రమపద్ధతిలో 4 స్థాయిల్లో సాగనున్నాయి.

పాఠశాల స్థాయిలో..

ఆగస్టు మొదటి, రెండో వారాల్లో ప్రతీ పాఠశాలలో అంతర్గత పోటీలు నిర్వహిస్తారు. తరగతి గదుల నుంచి మైదానంలోకి అడుగుపెట్టే చిన్నారుల కోలాహలంతో ఎస్జీఎఫ్‌ జాతర మొదలవుతుంది.

జోనల్‌ స్థాయిలో..

ఆగస్టు మూడో వారంలో ఇంటర్‌ మండల్‌ పోటీలు ఉత్సాహంగా సాగుతాయి. పోటీల్లో భాగంగా జిల్లా జట్లకు సంబంధించిన అత్యుత్తమ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుంది.

జిల్లాస్థాయిలో..

సెప్టెంబర్‌ రెండో వారంలో జిల్లా స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రతిభను కూడా కలుపుకుంటూ కేవలం ఒకే ఒక్క వారంలో ఈ ప్రతిష్టాత్మక పోటీలను పూర్తి చేయనున్నారు.

రాష్ట్రస్థాయిలో..

సెప్టెంబర్‌ 4వ వారంలో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. 10 జిల్లాల స్పోర్ట్స్‌ జోన్ల నుంచి వచ్చిన మేటి క్రీడాకారుల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు ఎంపికలు కూడా జరుగుతాయి. ఈ ఏడాది రాష్ట్రస్థాయి పోటీలను అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ప్రత్యేక సహకారంతో నిర్వహించనున్నారు.

ఉరకలెత్తనున్న విద్యార్థుల క్రీడాప్రతిభ

ఆగస్టు నుంచే స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడలు

2026–27 షెడ్యూల్‌ విడుదల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement