బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి ధర్మపురి ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు ‘ఎస్‌ఐఆర్’ శిక్షణలో మంత్రి అడ్లూరి
ధర్మపురి: కేంద్రప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగించే కుట్ర పన్నుతోందని, బూత్‌లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణ (సర్)పై పట్టణంలో నియోజకవర్గస్థాయి బూత్ లెవల్ ఏజెంట్లకు సోమవారం అవగాహన కల్పించారు. నియోజకవర్గంలోని 269 పోలింగ్ కేంద్రాల్లో 2.37 లక్షల మంది ఓటర్లున్నారని, వాటిలో కొన్ని తొలగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని, ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, ఇసుక రవాణాలో తాను అక్రమాలకు పాల్పడ్డానని మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్‌రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే 48 గంటల్లో మంత్రి పదవికి రాజనామా చేస్తానని సవాల్ చేశారు. జీవన్‌రెడ్డిలా పార్టీలు మార్చే నైజం తనది కాదని, ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని అన్నారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు లభించిందని మంత్రి తెలిపారు. కొన్నేళ్లుగా తక్కువ వేతనంతో పని చేస్తున్న 15 మంది స్వీపర్లకు రూ.12వేలకు పెంచుతూ దేవాదాయశాఖ నుంచి ఉత్తర్వులు రాగా.. మంత్రి అందించారు. ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని, 13 రూట్లలో కొత్తగా బస్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. బస్టాండ్‌లో అదనపు సౌకర్యాలపై కరీంనగర్ ఈడీ సోలామన్, ఆర్‌ఎం రాజు, జగిత్యాల డీఎంతో కలిసి పరిశీలించారు. ధర్మపురిలో బస్‌డిపో ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రుద్ర సంతోష్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య, గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు పాల్గొన్నారు.


