పిల్లలూ.. బ్యాగులు సర్దుకోండి..! | - | Sakshi
Sakshi News home page

పిల్లలూ.. బ్యాగులు సర్దుకోండి..!

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

● మోగనున్న బడిగంట ● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● స్వాగతం పలుకుతున్న సమస్యలు ● టాయిలెట్లకూ మరమ్మతులు కరువు

నేటి నుంచి ప్రారంభం

జగిత్యాల: వేసవి సెలవులు ముగిశాయి. ఇన్ని రోజులు ఆటపాటలతో గడిపిన పిల్లలు బడిబాట పట్టే సమయం ఆసన్నమైంది. నేటినుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పాఠశాలలను సిద్ధం చేసి ఉంచారు. తొలిరోజే అమావాస్య కావడంతో పిల్లల హాజరుశాతం అంతంతమాత్రంగానే ఉండనుంది. పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేకరకాల చర్యలు చేపట్టింది. ఇటీవలే ఎమ్మార్సీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. మన ఊరు మన బడి పథకం కింద జిల్లాకు రూ.1.19కోట్లు మంజూరు కాగా.. మరమ్మతులు, వివిధ కార్యక్రమాల కోసం 277 స్కూళ్లను ఎంపిక చేశారు. కానీ.. 48స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, పాఠశాలలకు కలర్లు, బెంచీలు, కిచెన్‌షెడ్స్‌ వంటివి 1087 పనులు మంజూరు కాగా.. కేవలం 450 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా కొన్నిచోట్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

బడిబాటతో పెరిగిన విద్యార్థుల సంఖ్య

ఈనెల 4 నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యాశాఖ అధికారులు అదనంగా రెండు వేల మందికి కొత్తగా అడ్మిషన్లు ఇవ్వగలిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందంటూ ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలలకు రప్పిస్తున్నారు.

పారిశుధ్యం అస్తవ్యస్తం

పాఠశాలల్లో గతంలో అమ్మ ఆదర్శ పథకం కింద స్కావెంజర్లను నియమించారు. కొన్నిచోట్ల నియామకం లేక పారిశుధ్యం అంతంతగానే ఉంది. టాయిలెట్స్‌ పూర్తిగా పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. అధికారులు స్పందించి పారిశుధ్యం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుంది. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించాం. విద్యార్థులకు మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. – రాము, డీఈవో

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement